Gandikota Fort Mystery: రాజులు మారిపోయారు… సామ్రాజ్యాలు కూలిపోయాయి… కానీ వాటి సాక్షిగా నిలిచే కోటలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి వాటిల్లో చెప్పుకోదగినది "గండికోట". కడప జిల్లాలోని జమ్మలమడుగు తాలూకాలో, పెన్నానది ఒడ్డున పర్వతాల మధ్య దాగున్న ఈ కోట ఓ చరిత్ర. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలుగులు విరజిమ్మిన ఈ గండికోట… కాకతీయులనుండి నవాబులదాకా నాలుగు సామ్రాజ్యాలకు అండగా నిలిచింది. హిందూ, ముస్లిం సంస్కృతుల కలయికగా విరాజిల్లిన ఈ కోట, ఆంధ్రప్రదేశ్ లో "ఇండియాస్ గ్రాండ్ క్యానియన్" అనే బిరుదును కూడా పొందింది.
గండికోట పేరు ఎలా వచ్చింది?
ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టం అవుతున్నది. ఈ గండి వెడల్పు కేవలం 300 అడుగులే అయినా, దాని లోతు, లోయ సుందర దృశ్యం చూస్తే మైమరచిపోతారు. ఒకవైపు ఎర్రటి గ్రానైట్ కొండలు… మరోవైపు ప్రవహించే నది… ఈకోటను శత్రువుల దాడికి దుర్భేద్యంగా మార్చాయి.
కోట నిర్మాణ వైశిష్ట్యం
గండికోట చుట్టూ దాదాపు ఐదు మైళ్ళ ప్రాకారం ఉంది. ఈ గోడలు 10 నుంచి 13 మీటర్ల ఎత్తులో ఉండేలా, ఎలాంటి పునాదులు లేకుండా నున్నని శిలలతో నిర్మించబడ్డాయి. 40 బురుజులతో కూడిన గోడపై సైనికుల రాకపోకలకు ప్రత్యేక మార్గం ఉంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో చేయబడి ఉన్నాయి. ఆ తలుపులపై ఇనుప సూది మేకులను ఏర్పాటు చేశారు. అంటే, ఇవి ఎంత ఎంత బలమైన రక్షణ వ్యవస్థను కలిగించేవో చెప్పే స్పష్టమైన ఉదాహరణ.
Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?
కోటలోని ప్రధాన కట్టడాలు
కోట అంతర్భాగంలో మాధవరాయ ఆలయం, రంగనాథ ఆలయం అనే రెండు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. మాధవరాయ ఆలయం 16వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. రంగనాథ ఆలయం గురించి 1479లో ప్రస్తావించబడిన శాసనం ఆధారంగా చూస్తే ఇది విజయనగర సామ్రాజ్యం నిర్మాణమేనని స్పష్టం అవుతుంది. జామా మసీదు, ధాన్యాగారము, మందుగుండు గిడ్డంగి, రంగ్ మహల్, పావురాల గోపురం, రాజుల చెరువులు ఇవన్నీ ఈ కోటలోని అద్భుత కట్టడాలు.
ప్రకృతి రహస్యాల మేళవింపు
గండికోట కేవలం కోట మాత్రమే కాదు. ఇది ప్రకృతితో ఒదిగిపోయిన శిల్పం. రెండు వందల అడుగుల ఎత్తైన ఇసుకరాతి కొండల మధ్య సాగే ఈ నదీ ప్రవాహం.. సాయంత్రం సమయంలో సూర్యకాంతి తాకితే, ఆ దృశ్యం కన్నులపండువుగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చెరువులు, బావులు, నేల అడుగునుండి పైకి వచ్చే నీటి సదుపాయాలు, ఆధునిక కాలాన్ని తలపించే విధంగా ఉంటాయి.
కోట చరిత్రలో పెమ్మసాని నాయకుల పాత్ర
గండికోటను జనరంజక పాలనకు ఉదాహరణగా నిలిపినవారు పెమ్మసాని నాయకులు. వీరి పాలనలో ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. ప్రజలకు నీటి వసతి, భద్రత కల్పిస్తూ ప్రజాపాలన సాగించారు. కానీ, నవాబుల కాలంలో ఈ ఆలయాలపై దాడులు జరిపి శిథిలాలుగా మార్చినట్లు స్థానిక కథనాలంటున్నాయి.
Also Read: ప్రపంచ యుద్ధ చరిత్రను మార్చిన భారతీయుడు గురించి మీకు తెలుసా?
నేటి గండికోట పరిస్థితి
గండికోట రాయలసీమ జిల్లాలోనే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. పాడుబడ్డ గుర్రపుశాలలు, రాణి ఆవాసాలులాంటివి నేటికీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రతి వారం శుక్ర, శని, ఆదివారాల్లో సందర్శకులు వస్తున్నారు.
గండికోట… ఒకటి కాదు, రెండు కాదు… నాలుగు సామ్రాజ్యాల తాలూకు గర్వకేతనం. చరిత్రలో శిల్ప కళకు చిరస్థాయిగా నిలిచిన అద్భుత సృష్టి. శతాబ్దాలపాటు సామ్రాజ్యాల గర్వంగా వెలిగిన ఈ కోట, ప్రకృతి రక్షణ, మానవ నిర్మాణ కౌశల్యం కలిసి కలిపిన ఘన గాథ. పెన్నానదిని హత్తుకున్న ఎర్రమలలు, దుర్భేద్య గోడలు, దేవాలయాలు, మసీదు… అన్నీ కలసి ఈ కోట వైభవాన్ని మాటల్లో వివరించలేని స్థాయికి తీసుకెళ్లాయి. ఇది కాకతీయుల, విజయనగరుల, నవాబుల శిల్ప వారసత్వానికి జీవంగా మిగిలిన నిశ్శబ్ద చరిత్ర. గండికోట… అది ఒక కోట కాదు, భారతీయ కౌశల్యానికి నిలువెత్తు నిదర్శనం.
Also Read: ప్రపంచానికి నాణేలు పరిచయం చేసినది భారతదేశమే.!
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS