Shubhanshu Shukla Return: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం ఈ నెల జూలై 14న భూమికి తిరిగి రానున్నారు. దాదాపు రెండు వారాలుగా ISSలో ఉంటూ శాస్త్రీయ పరిశోధనలు జరుపుతున్న శుభాంశు ఇప్పటివరకు 230 సూర్యోదయాలు చూడడమే కాకుండా, 96.5 లక్షల కిలోమీటర్ల దూరం అంతరిక్షంలో ప్రయాణించారు. జూన్ 25న ISSలో ల్యాండ్ అయిన శుభాంశు, నాసా నుంచి వచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలతో త్వరలోనే భూమికి తిరిగిరానున్నారు.
యాక్సియం స్పేస్ సంస్థ వెల్లడించిన ప్రకారం -
“యాక్సియం-4 బృందం దాదాపు 230 సార్లు భూమిని చుట్టేశారు. వారు ఆరు మిలియన్ మైళ్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించారు. భూమికి సుమారు 250 మైళ్ల ఎత్తులో ఉండి, తీరిక సమయంలో ఫోటోలు, వీడియోలు తీయడంతో పాటు, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రపంచాన్ని తమ కెమెరాల్లో బంధించారు. రోజువారీ బిజీ షెడ్యూల్ నుంచి ఇవి వారికి ఎంతో ఉపశమనం కలిగించాయి” అని యాక్సియం స్పేస్ సంస్థ వెల్లడించింది.
శాస్త్రీయ పరిశోధనల కేంద్రబిందువుగా శుభాంశు బృందం
శుభాంశు శుక్లా బృందం ISSలో అనేక ప్రయోగాలు నిర్వహించడమే కాకుండా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పాఠశాల విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలు కూడా జరిపారు.
ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేశారు. దీర్ఘకాల రోదసి యాత్రల్లో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల అభివృద్ధికి శుభాంశు బృందం చేసిన పరిశోధనలు ఉపయోగపడనున్నాయి.
అంతేకాక, రోదసిలో ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థలపై గ్రహించిన ప్రభావాలను విశ్లేషించారు. ఇది భవిష్యత్తులో ISSలో వ్యోమగాముల జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది.
జాతీయ, అంతర్జాతీయ ప్రయోగాల్లో భాగస్వామ్యం
శుభాంశు నాసా ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో కూడా పాల్గొన్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా, వ్యోమగాములు 31 దేశాల శాస్త్రవేత్తలతో కలిసి 60 సైన్స్ ఎక్స్‌పెరిమెంట్స్ నిర్వహించారు. ISSలో ఒకే మిషన్‌లో ఇన్ని ప్రయోగాలు జరగడం అరుదైన రికార్డ్‌గా నమోదైంది.
ఈ ప్రయోగాల ఫలితాలు భారత గగన్‌యాన్ మిషన్ కు సైతం ఎంతో ఉపయోగపడనున్నారు. మధుమేహం నిర్వహణ, మెరుగైన క్యాన్సర్ చికిత్సలు, మానవ ఆరోగ్యం పర్యవేక్షణ రంగాల్లో ఈ పరిశోధనలు కీలక మార్గనిర్దేశకంగా మారనున్నాయి.
Also Read: ఎవరీ శుభాంశు శుక్లా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడు..
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS