Kota Srinivasa Rao: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు

Kota Srinivasa Rao: తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇకలేరు. ఆయన ఆదివారం తెల్లవారుజామున, హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

కోట శ్రీనివాసరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు. ఆయన 1942 జూలై 10న జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే, ఆయన కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన ఆయన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కొడుకు లేని లోటుతో ఆయన తీవ్రమైన మానసిక వేదనకు లోనయ్యారు.

తెలుగు చలనచిత్ర రంగంలో ఎస్వీ రంగారావు వంటి మహానటుడు తర్వాత అలాంటి స్థాయి నటుడు వస్తాడా అనే సందేహాల మధ్య, కోట శ్రీనివాసరావు తన నటనా నైపుణ్యంతో ఆ లోటును పూరించారు. 1978లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో కోట వెండితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో, కోటకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 1979లో నాలుగు సినిమాలు, 1980లో ఏకంగా 13 చిత్రాల్లో నటించారు.

అయితే, ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన చిత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహనా పెళ్లంట’. ఈ చిత్రంలో పరమ పీనాసిగా నటించిన కోట శ్రీనివాసరావు తన నటనతో విమర్శకుల ప్రశంసలు మరియు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఆ చిత్రం తర్వాత ఆయన సంవత్సరానికి 20–30 సినిమాల వరకు చేస్తూ, అగ్రనటుల సరసన నిలిచారు.

Also Read: చెట్ల కింద చదువుకుని… ప్రపంచ స్థాయికి చేరిన జై చౌదరి స్టోరీ

కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించిన విభిన్న పాత్రలు తెలుగు సినిమాకి, నటనకి, మార్గదర్శకంగా నిలిచాయి. అతని కామెడీ టైమింగ్‌దే కాదు, విలనిజం, భావోద్వేగ సన్నివేశాల్లోనూ గొప్పగా నటించగల సత్తా ఉన్న నటుడు. అందుకే కోట శ్రీనివాసరావు లెజెండ్ అని అందరూ అభిప్రాయపడతారు.

అయన సినిమాల్లో కనిపించని లోటు ఇప్పటికే తెలుగు చిత్రసీమకు కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన శాశ్వతంగా మనల్ని విడిచి వెళ్లిపోవడం మాత్రం తట్టుకోలేని విషాదం. ఆయన చివరిసారి నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా జూలై 24న గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది.

తన విలక్షణమైన అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కోట శ్రీనివాసరావు, ఎటువంటి పాత్రకైనా జీవం పోయగలిగిన అరుదైన నటుల్లో ఒకరు. ఆయన లేని లోటు ఆయన కుటుంబానికి, సినీ పరిశ్రమకు తిరిగిరాని నష్టమే. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించుకుంటూ... కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి.

Also Read: భూమికి తిరిగొస్తున్న శుభాంశు శుక్లా బృందం.!

Post a Comment (0)
Previous Post Next Post