తెలంగాణ ప్రభుత్వం సంచలనం నిర్ణయం.. 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆర్డినెన్స్ జారీ.


తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేస్తూ 2018 నాటి పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు నిర్ణయం తీసుకుంది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి జరుగుతోంది.

ఎస్‌సీ వర్గీకరణ తర్వాత మరో సాహసోపేతమైన అడుగు

ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఇప్పటికే తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఇప్పుడు అదే దారిలో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ మరో సామాజిక విప్లవానికి నాంది పలికింది. బీసీ డెడికేషన్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా కుల గణనను పూర్తిచేసి, బీసీల జనాభా లెక్కల ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ కోటా ఖరారు చేసింది.

రాహుల్ గాంధీ డిమాండ్… అమలులోకి
బారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ డిమాండ్‌కి అనుగుణంగా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యరూపం ఇచ్చింది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటీవల ఆదేశాలిచ్చిన నేపథ్యంలో వేగంగా స్పందించిన ప్రభుత్వం, బీసీలకు పెద్దపీట వేసింది.

ఆర్డినెన్స్ జారీతో బీసీ రిజర్వేషన్లు

బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలించింది:

1. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం ద్వారా చట్ట సవరణ

2. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం

3. పార్టీపరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించడం

ఈ మూడింటిలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్డినెన్స్ ద్వారా జీవో తీసుకరావడానికి కేబినెట్ ఓటేసింది. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం ద్వారా చట్ట సవరణ తీసుకరావడం ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి, పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి, గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్‌ ద్వారా జీవో తీసుకురావాలని నిర్ణయించింది. 

మొత్తం రిజర్వేషన్లు 70 శాతం

ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు 42 శాతం కోటా కల్పించినట్లయితే మొత్తం రిజర్వేషన్లు 70 శాతంకు చేరతాయి. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సబబైనదేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ కేంద్రం చట్టసవరణ చేసి, రాష్ట్రపతి ఆమోదం తో 9 వ షెడ్యూల్ లో ఈ అంశాన్ని చేర్చితే తప్ప సుప్రీం కోర్టు ఈ అంశంపై జోక్యం చేసుకోదని, అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ కి కోర్టుల నుండి ముప్పు ఉంటుందని రాజ్యాంగ నిపుణుల అంచనా.

ప్రతిపక్షాలకు ఛాలెంజ్

స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్న కాంగ్రెస్, బీసీ రిజర్వేషన్లను ప్రధాన అస్త్రంగా వినియోగించేందుకు సిద్ధమైంది. బీసీ ఓటుబ్యాంకు తమదేనన్న ధీమాతో ముందుగానే విజయోత్సవాల్లో మునిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ లపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఖరిని స్పష్టంచేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో స్థానిక ఎన్నికలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు పెద్ద ఛాలెంజ్ గా మారనున్నాయి.

సామాజిక న్యాయానికి నూతన అధ్యాయం

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక రాజకీయ నిర్ణయంగా చూడకుండా, ఇది పేద బీసీ వర్గాలు దశబ్దాలుగా ఎదురుచూస్తున్న హక్కుల సాధనకు ఒక ముందడుగుగా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇది చట్టభద్ధంగా నిలబడాలంటే సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పాటిస్తూ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలి.

రాజకీయ సంకల్పానికి న్యాయ వ్యవస్థ మద్దతు తోడైతే ఆ నిర్ణయం చిరస్థాయిలో నిలుస్తుంది.


Post a Comment (0)
Previous Post Next Post