India 2025 Recap: మహా కుంభమేళా నుంచి అంతరిక్ష పయనం వరకు… 2025 ప్రారంభార్ధంలో భారతదేశం అనేక విశేష ఘట్టాలకు వేదిక అయింది. ఆధ్యాత్మిక వేడుకల వైభవం, రాజకీయ పరివర్తనాలు, హింసాత్మక ఘటనలు, విమాన ప్రమాదం వంటి విషాదాలు, అంతరిక్షంలో భారత కదలికలు ఇవన్నీ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. 2025 జనవరి నుంచి జూన్ వరకు చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలపై ఒకసారి విశ్లేషణ:
![]() |
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం: ఫిబ్రవరి 5న నిర్వహించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకుని, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలు ప్రముఖులు ఓటమిపాలయ్యారు. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన: జాతుల మధ్య ఘర్షణల నేపథ్యంలో, ఫిబ్రవరి 13న మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించబడింది. సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తరువాత రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలను గవర్నర్ కు అప్పగించారు. హింసాత్మక ఘటనలు, పౌర మరణాలు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి: ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఆపరేషన్ సిందూర్ - భారత్ ప్రతీకారం: మే 7న భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై దాడికి దిగింది. మే 10న భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రాంప్ ఈ విరమణకు కారణం కాదని చెప్పింది.
ఎయిరిండియా విమాన ప్రమాదం: జూన్ 12న అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానం టేకాఫ్ సమయంలో వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ దారుణ ఘటనలో 260 మంది మృతి చెందగా, 241 మంది ప్రయాణికులు, 19 మంది స్థానికులుగా గుర్తించారు. ఒకే ఒక ప్రయాణికుడు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: తెలంగాణ చరిత్రలోనే అత్యంత విషాదకరంగా నిలిచిన పాశమైలారం పేలుడు ప్రమాదం.!
శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం: జూన్ 25న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. 'యాక్సియం-4' మిషన్‌లో భాగంగా ఫాల్కన్-9 ద్వారా ప్రయాణించిన శుభాంశు, డాకింగ్ అనంతరం అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి మోదీ ఈ ఘట్టాన్ని “నవ శకం ఆరంభం”గా అభివర్ణించారు.
రణ్ వీర్ అల్హాబాదియా వివాదం: ఫిబ్రవరిలో ప్రసారం అయిన 'ఇండియాస్ గాట్ లాటెంట్' కార్యక్రమంలో యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇతనితో పాటు సమయ్ రైనా, ఆశీష్ చంచలానీ తదితరులపై కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు సహించలేమని స్పష్టం చేసింది.
తొక్కిసలాట ఘటనలు: ఈ ఏడాది పలు ప్రముఖ వేడుకల్లో తొక్కిసలాటలు ప్రాణనష్టం కలిగించాయి. జనవరి 29న ప్రయాగ్ రాజ్ కుంభమేళా, ఫిబ్రవరి 15న న్యూదిల్లీ రైల్వే స్టేషన్, మే 3న గోవా ఆలయం, జూన్ 1న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, జూన్ 29న పూరీ జగన్నాథ రథయాత్రల్లో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.
నక్సలైట్లపై భద్రతా బలగాల దాడులు: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా ఈ ఆరు నెలల్లో దాదాపు 250 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2026 మార్చికల్లా దేశాన్ని నక్సల్స్ రహితం చేయడమే లక్ష్యంగా కేంద్రం కార్యాచరణను ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా, ఆయుధాలు చేతపట్టినవారితో చర్చల అవసరం లేదని పునరుద్ఘాటించారు.
Also Read: 2025 తొలి ఆరు నెలల్లో భారతదేశాన్ని వణికించిన 6 అతిపెద్ద విపత్తులు
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS