Dalai Lama Escape from Tibet: టిబెట్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా ప్రస్తుతం తన 90వ ఏట అడుగుపెట్టారు. ఆయన గత 66 ఏళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్‌లో అడుగుపెట్టిన ఆయన, మళ్లీ టిబెట్ వైపు తిరిగి చూసే అవకాశం కూడా పొందలేదు. బుద్ధుని అవతారంగా భావించి ఆరాధించే దలైలామా, టిబెట్‌ను వదిలి భారత్‌కు ఎందుకు వచ్చారు? బుల్లెట్లను, ద్రోహాన్ని తప్పించుకొని... ఓ యువ టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు మన దేశానికి ఎలా చేరుకున్నాడు? గడ్డకట్టే వాతావరణం మధ్య, కఠినమైన మార్గాల్లో రెండు వారాల సుదీర్ఘ ప్రయాణం ఎలా సాగింది? ఇది టిబెట్ రాజకీయ కల్లోలాన్ని వివరించే ఓ అసాధారణ కథ.
అది 1950ల చివరి దశ. చైనా ఆక్రమణలతో టిబెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 1951లో, చైనా బలవంతంగా ఒప్పించించిన పదిహేడు పాయింట్ల ఒప్పందం ద్వారా టిబెట్ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ ఒప్పందం, టిబెటన్ ప్రజలకు మతపరమైన స్వయంప్రతిపత్తి హామీ ఇస్తుందనే భ్రమను కలిగించింది. కానీ ఇది కేవలం ఒక మాయమాత్రమని త్వరలోనే స్పష్టమైంది. 13వ దలైలామా చెప్పినట్లుగానే, టిబెట్‌పై మాత్రమే కాదు, వారి మతంపై కూడా దాడులు ప్రారంభమయ్యాయి. చైనా సైనికులు టిబెట్ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరగడం ప్రారంభించారు. బౌద్ధ సన్యాసుల భూములను స్వాధీనం చేసుకోవడం మొదలైంది. ఈ పరిణామాలతో దలైలామా అధికారం క్రమంగా తగ్గింది. రాజీ కోసం ఆయన మధ్యవర్తిత్వానికి యత్నించినా ఫలితం లేకుండా పోయింది.
1959 నాటికి ప్రజల నిరసనలు తిరుగుబాటుగా మారాయి. తమ ఆధ్యాత్మిక నాయకుడిని నిర్బంధిస్తారో, లేదంటే హత్య చేస్తారో అన్న భయం టిబెటన్ ప్రజల్ని ఆందోళనకు గురిచేసింది. అంచనాలకు అనుగుణంగా, చైనా సైనిక దళాలు ట్యాంకులు, ఫిరంగులతో లాసాను చుట్టుముట్టాయి. అదే రోజు, దలైలామాను అంగరక్షకులు లేకుండా తమ సైనిక కార్యాలయంలో జరుగబోయే నృత్య ప్రదర్శనకు రావాలని చైనా జనరల్ కోరాడు. దీని వెనుక కుట్ర ఉందని భావించిన ప్రజలు వేలాదిగా వీధుల్లోకి వచ్చారు. నార్బులింగకా వద్ద దలైలామా వేసవి నివాసం చుట్టూ మానవహారంగా నిలబడ్డారు. ఆ రాత్రే కీలక నిర్ణయం తీసుకున్న దలైలామా… లాసాను విడిచి భారత్ వైపు సాగిపోయారు.
1959 మార్చి 17న, పొగమంచుతో కమ్మిన రాత్రి. ఎప్పుడూ మెరూన్ వస్త్రాల్లో కనిపించే దలైలామా, తనను ఎవరూ గుర్తించకుండా సైనికుడి యూనిఫాం ధరించారు. తల్లి, సోదరులు, ట్యూటర్, విశ్వసనీయ అధికారులు ఆయన వెంట ఉన్నారు. చీకటి నడుమ, రాజభవన వెనుక ద్వారం గుండా బయటకు వెళ్లారు. చైనా చెక్ పోస్టులను తప్పించుకుంటూ, ఎక్కువగా రాత్రిపూటనే ప్రయాణించారు.
చుషుల్, లోకా, కైచు లోయల గుండా, ఖెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి, నేటి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వైపు సాగారు. ఇది గడ్డకట్టే చలి. ఆహారం లేక, పరిస్థితులు అధ్వాన్నంగా మారినా వారి ప్రయాణం కొనసాగింది. వారి బృందం కెచు నది దాటి, ఎత్తైన లోయలు, బౌద్ధ మఠాలు, తిరుగుబాటు శిబిరాల గుండా సాగింది. ఒకసారి చైనీస్ నిఘా విమానం వారిపైనే ఎగిరింది. అదృష్టవశాత్తూ వారి బృందం తప్పించుకుంది. ఎట్టకేలకు మార్చి 26న, భారత్ సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లుంట్సే జోంగ్ చేరుకున్నారు.
ఈ సమాచారాన్ని వెంటనే ప్రధాని నెహ్రూ వరకు చేర్చారు. అప్పటికే చైనా నుంచి హెచ్చరికలున్నా, నెహ్రూ చింతించకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తవాంగ్ సమీపంలోని చుటాంగ్ము సరిహద్దు పోస్టుకు వెళ్లి, దలైలామా బృందానికి స్వాగతం పలకాలని అస్సాం రైఫిల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు.
1959 మార్చి 31న, దలైలామా ఖెంజిమనే పాస్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. భారత్, చైనాలను విడగొట్టే మెక్మోహాన్ రేఖ సమీపంలో ఓ చిన్న సరిహద్దు పోస్టులో, అలసిపోయిన, నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తిని చూసి హవల్దార్ నరేన్ చంద్ర దాస్ ఆశ్చర్యపోయాడు. ఆయనే 14వ దలైలామా అని అతనికే కాదు, భారతీయులెవరికీ తెలియదు. ఇదే దలైలామా భారత భూమిపై అడుగుపెట్టిన చరిత్రాత్మక క్షణం. ఆ వెంటనే నెహ్రూ నుంచి ‘టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి భారత్‌లో ఆశ్రయం లభిస్తుంది’ అనే సందేశం వచ్చింది. దాస్‌తో పాటు ఇతర జవాన్లు దలైలామా బృందాన్ని తవాంగ్‌కు తీసుకెళ్లి వైద్యం అందించారు. కొద్ది నెలలు ఆయన ముస్సోరీలో గడిపిన తర్వాత, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో స్థిరపడ్డారు. అప్పటినుంచి అదే టిబెటన్ ప్రవాస ప్రభుత్వానికి కేంద్రంగా మారింది.
భారత్‌లో శరణార్థిగా జీవిస్తున్న దలైలామా, "నేను శరణార్థిని, అయినా భారత్‌లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను" అని అనేక సందర్భాల్లో అన్నారు. 2017లో, తనకు మొదటిసారి స్వాగతం పలికిన హవల్దార్ నరేన్ చంద్ర దాస్‌ను కలిశారు. దాస్ అప్పటికే 79 ఏళ్లు, దలైలామాకు 81 ఏళ్లు. “మీ ముఖం చూస్తే… నేను కూడా వృద్ధుడినే అనిపించింది. నన్ను రక్షించడంలో మీరు కీలకపాత్ర పోషించారు. ధన్యవాదాలు" అని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.
దలైలామాను అనుసరించి వేలాది మంది టిబెటన్లు భారత్‌లో శరణార్థులుగా స్థిరపడ్డారు. కానీ టిబెట్ సమస్యకు పరిష్కారం ఇంకా దొరకలేదు. ఆరు దశాబ్దాల క్రితం సైనికుడి వేషంలో భారత్‌లోకి ప్రవేశించిన దలైలామా చూసిన పరిస్థితి… ఈరోజు కూడా మారలేదు. లక్షలాది టిబెట్ల రాజకీయ, మత, సాంస్కృతిక జీవన విధానంపై ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది.
Also Read: గండికోటలో దాగిన చరిత్ర గురించి మీకు తెలుసా.!?
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS