కేసీఆర్ – ఫామ్‌హౌస్ సీఎం?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. కొన్నాళ్ల వరకు మాత్రమే సచివాలయానికి వచ్చారు. తరువాత వాస్తు కారణాలను చూపుతూ పూర్తిగా దూరమయ్యారు. ఆయన పాలనలో "ప్రగతిభవన్" కేవలం సమీక్షలు, సమావేశాలకు పరిమితం కాగా, "ఫామ్‌హౌస్" పాలన కేంద్రంగా నిలిచింది. పాత సచివాలయాన్ని కూల్చి, కోటలా కనిపించే కొత్త సచివాలయాన్ని నిర్మించుకున్నప్పటికీ, అక్కడ ఆయన హాజరు మాత్రం కనబడలేదు.
ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ప్రజలు వినతులు చెప్పే చోటు. కానీ కేసీఆర్ హయాంలో ప్రగతిభవన్ గడిలా మారిపోయిందన్న ఆరోపణలు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నుండి ఎదురయ్యాయి. మీడియా ప్రవేశంపై ఆంక్షలు, ప్రజలను సచివాలయం లోకి అనుమతించకపోవడం, ఇవన్నీ ప్రజల నుంచి అధికారాన్ని దూరంగా ఉంచే సంకేతాలుగా మారాయి.
రేవంత్ రెడ్డి – ఓన్‌హౌస్ సీఎం?
విపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ‘గడీల సీఎం’ అంటూ విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే తీరులో ‘ఓన్‌హౌస్ సీఎం’గా ముద్రపడుతున్నారు. మొదట్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా ప్రగతిభవన్ గేట్లు తీసివేసి, సచివాలయం ప్రజలకు తెరిచే ప్రయత్నాలు చేసిన రేవంత్.. కొన్ని నెలలకే తిరిగి తలుపులు మూసేశారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయం కు అప్పుడప్పుడు వస్తూ, జూబ్లీహిల్స్ లోని తన సొంతింటి నుండే పరిపాలన సాగిస్తున్నారు.
సచివాలయంలోకి మీడియా ప్రవేశానికి ఆటంకాలు ఏర్పడటం, సీఎంఓ ఛాంబర్‌ను ఆరో అంతస్తులో రహస్యంగా నిర్వహించడం వంటి చర్యలతో ప్రజలందరికీ అందుబాటులో ఉన్న పాలన అనే ఆశలు ప్రస్తుతం ఆవిరయ్యాయి. ఉన్నత స్థాయి అధికారులు సైతం సీఎంను కలవాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
ప్రజాస్వామ్య పరిపాలనకు ఇది మంచిదా?
ప్రజలు స్వేచ్ఛగా కలిసే స్థలంగా ఉండిన సచివాలయం, ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసు తరహాలో మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా కారణాలంటూ ప్రజలను, విలేకరులను అడ్డుకోవడం ఒక పారదర్శక పాలనకు విరుద్ధంగా భావించబడుతోంది.
ఇకనైనా మారాలి!
రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరిగితే, పాలనలో పారదర్శకత పెరుగుతుందన్న ఆశలు ప్రజల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి సచివాలయంలో అందుబాటులో ఉంటూ, ప్రజలను కలుస్తూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే విధానాన్ని కొనసాగించాలన్నది ప్రజల ఆకాంక్ష. రేవంత్ సర్కారులో కూడా అది సాధ్యం కాకపోతే 'ఫామ్‌హౌస్ సీఎం' నుండి 'ఓన్‌హౌస్ సీఎం' కి మారిందన్న అభిప్రాయాలు మరింత బలపడతాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యమం ద్వారా సాధించుకున్న ఈ రాష్ట్రానికి నిజమైన ప్రజాకేంద్ర పాలన కావాలి. ముఖ్యమంత్రులు ప్రజల మధ్య ఉండాలి. సచివాలయం తలుపులు పౌరులకోసం తెరుచుకుని ఉండాలి. లేకపోతే సచివాలయం అనే పదానికే సార్ధకం లేదనే స్థితి ఏర్పడుతుంది.