Titu Singh Rebirth Mystery: మనుషులు పుట్టడం, జీవించడం, మరణించడం అనేవి సహజ ప్రక్రియలే. కానీ మరణించిన ప్రాణం మళ్లీ పుట్టొచ్చా? మరణించిన ఓ వ్యక్తి జ్ఞాపకాలు, అనుభూతులు, జీవిత విశేషాలు మరొకరికి ఎలా గుర్తుంటాయి? ఇవన్నీ శాస్త్రానికి ఓ సవాల్. అలాంటి ప్రశ్నలన్నింటికీ కేంద్రబిందువుగా మారిన వ్యక్తే టీటు సింగ్ తోరన్.
ఇది కథ కాదు… కళ్లముందు నిజంగా జరిగింది. ఇది ఒక చిన్నారి చెప్పిన మాటలతో మొదలై, ప్రపంచ నోరెళ్లబెట్టే రీతిలో పునర్జన్మ అనే మిస్టరీకి ప్రాణం పోసిన కథ. దీనిలో భయం ఉంది, విచిత్రం ఉంది, కాని అంతకన్నా ఎక్కువగా ఒక unsolved మిస్టరీ దాగి ఉంది.
సురేశ్ వర్మ మరణం: 1983 ఆగస్ట్ 28… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా నగరంలోని మాల్ రోడ్ లో ఓ రేడియో షాప్ యజమాని అయిన సురేశ్ వర్మ, తన నిత్య జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడిపే సాధారణ మనిషి. ఆ రోజు కూడా షాప్ మూసి ఇంటికి బయలుదేరాడు. ఇంటి గేటు దగ్గరకు వచ్చాక, అతను పదే పదే హారన్ వేశాడు… కానీ ఎవ్వరూ బయటకు రాలేదు. ఆ సమయంలో అకస్మాత్తుగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు తుపాకులతో ముందుకు వచ్చారు. అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి… వారిలో ఒకడు తుపాకీతో కాల్చడంతో, ఆ బుల్లెట్ సురేశ్ తలకి తాకింది. తలలో బుల్లెట్ తగలడంతో సురేష్ వర్మ అక్కడికక్కడే మరణించాడు. ఈ దాడి ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఎవరికీ తెలియలేదు. కానీ, ఆ ఘటన అనేది ఆ కుటుంబానికి కోలుకోలేని దుర్ఘటన. భార్య ఉమా, ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులందరికీ జీవితం ఒక్కసారిగా శూన్యంలోకి వెళ్లిపోయినట్టు అయింది. సురేశ్ వర్మ కుటుంబం ఈ అఘాయిత్యాన్ని మానసికంగా భరించలేక పోయారు.
ఒక జీవితం ముగిసిన నాలుగు నెలలకే… ఇంకొక జీవితం మొదలైంది?: ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఉత్తర ప్రదేశ్‌లోని బాద్ గ్రామంలో, ఆగ్రా శివార్లలోని ఒక 13 కిలోమీటర్ల దూరాన ఉన్న చిన్న బస్తీలో డిసెంబర్ 10, 1983లో టీటు సింగ్ అనే ఓ బాలుడు జన్మించాడు. అతడి పేరే తోరన్ సింగ్, ఇంట్లో అందరూ టీటు అనే పిలిచేవారు. సురేశ్ చనిపోయిన తేదీ 1983, ఆగష్టు 28. కరెక్టుగా సురేష్ చనిపోయిన నాలుగు నెలలకే ఇంకొక జీవితం మొదలైంది.
టీటు రెండు సంవత్సరాల వయస్సులో ఉండగానే, కొన్ని విచిత్రమైన మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. “ఇది నా ఇల్లే కాదు… మీరు నా తల్లిదండ్రులే కాదు… నా పేరు టీటు కాదు… నా పేరు సురేశ్ వర్మ … నాకు భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు,” అంటూ మాటలు మాట్లాడే వాడు. మొదట్లో టీటు వాళ్ళ అమ్మ నాన్నలు ఈ మాటలని చాలా తేలికగా తీసుకున్నారు. పోను పోనూ ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు.. మా ఇంటి ముందు ఫియట్ కార్ ఉండేది. నేను రేడియో షాప్ నడిపేవాడిని. కానీ నన్ను కాల్చేశారు… బుల్లెట్ తలకి తాకింది… అక్కడికక్కడే చనిపోయా అని మాట్లాడాడు. ఈ మాటలు విన్న టీటు వాళ్ళ అమ్మ నాన్నలు ఆందోళనకు గురి అయ్యారు.
సాధారణంగా చిన్న పిల్లలు రెండు సంవత్సరాల వయస్సు ఉన్నపుడు అత్తా, తాత అనుకుంటూ వచ్చి రాని మాటలు మాట్లాడతారు, పైగా మాటలు కూడా చాలా స్పష్టంగా రావు. కానీ టీటు విషయంలో మాత్రం చాలా వింత ఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అది కూడా చాలా స్పష్టంగా.. అతని జ్ఞాపక శక్తి, స్పష్టత, వివరాలు చూసి టీటు వల్ల అమ్మ నాన్నలు షాక్‌కి గురయ్యారు.
నెలలు గడిచే కొద్దీ, టీటు బిహేవియర్ పూర్తిగా మారిపోయింది. ఏంటి అమ్మా నువ్వు ఎప్పుడూ ఈ ముతక చీరలు కడుతూ ఉంటావు.? నా భార్య ఉమా దగ్గర మంచి మంచి ఖరీదు చీరలు ఉండేవి అని అనేవాడు. “నా ఇంట్లో బంగారు నాణాలు, పెద్ద కారు ఉండేవి… ఇక్కడ ఏమీ లేదు…” అంటూ తన తల్లిదండ్రుల పేదరికాన్ని ఎద్దేవా చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు.
కెమిస్ట్రీ లెక్చరర్ గా పని చేస్తున్న టీటు తండ్రి మహావీర్ ప్రసాద్, ఈ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే, ఆరుగురి సంతానంలో టీటు అందరికంటే చిన్నవాడు అని. కానీ టీటు, తనకి నాలుగేళ్ళు వచ్చేసరికి,“ఆగ్రాకు తీసుకెళ్ళండి…” అంటూ అడగడం ప్రారంభించాడు. ఓసారి తండ్రి మహావీర్ ప్రసాద్ ఆగ్రాకు పనిమీద వెళ్ళగా… టీటు తీవ్రంగా కోపంతో అరవడం, ఏడవడం మొదలుపెట్టాడు. తన “నిజమైన కుటుంబాన్ని” కలవాలని పట్టుబడ్డాడు.
ఇదంతా చూసిన టీటు అన్నయ్య అశోక్, ఒక రోజు టీటు చెప్పినట్టు ఆగ్రాలో ఓ రేడియో షాపు ఉందో లేదో తెలుసుకోవడానికి వెళ్ళాడు. మాల్ రోడ్‌లో ఉన్న “సురేశ్ రేడియోస్” అనే షాపుని చూసి ఆశ్చర్యపోయాడు. షాపు యజమాని ఒక వితంతువు… ఆమె పేరు ఉమా వర్మ. ఆమె ఎవరో కాదు, మృతుడు సురేశ్ వర్మ భార్యే. టీటు చెప్పినట్లుగానే “Suresh Radio House” బోర్డు ఇప్పటికీ అక్కడే ఉంది. ఉమా చెప్పినట్లుగా సురేశ్ వర్మ 1983 ఆగష్టులో కాల్చి చంపబడ్డాడనే విషయం అశోక్ కు స్పష్టంగా తేలిపోయింది. అశోక్ తన తమ్ముడి మాటలు చెబుతే ఉమా ఆశ్చర్యపోయింది. స్వయంగా టీటును చూడాలనే ఆసక్తితో ఆమె వారి ఇంటికి వచ్చింది.
ఉమా వర్మా టీటూను చూడటానికి బాద్‌కు వచ్చారు. ఇంటి ముందు ఉన్న నీళ్ల చెరువు దగ్గర టీటూ నీటితో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా అతడు ఆమెను చూశాడు. "నా పాత కుటుంబం వచ్చింది" అని అరవడం ప్రారంభించాడు. అతడి హావభావాలు, మాటలు ఉమాను కంగారు పెట్టాయి. టీటు మామూలు పిల్లల్లా ప్రవర్తించలేదు. ఆమె వచ్చిన కారు చూసి వెంటనే “ఫియట్ కార్ అమ్మేసి, ఇప్పుడు మారుతి వాడుతున్నారా” అని అన్నాడు. ఇది విని ఉమా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అసలు విషయం ఎవరికీ చెప్పలేదు కదా... మరి ఈ చిన్నోడికి ఎలాగ తెలిసింది? అని..
ఆమెను దగ్గరగా కూర్చోవాలని అడగడం, తన ఇద్దరి పిల్లల గురించి ప్రశ్నలు వేయడం, ఒకసారి పండుగకు వెళ్ళినప్పుడు జిలేబీలు కొనిపెట్టిన సంగతి చెప్పడం ఇవన్నీ సురేష్ వర్మకు సంబంధించిన వ్యక్తిగత జ్ఞాపకాలు. ఎవరికీ తెలియని డీటెయిల్స్ కూడా.. కానీ, టీటూ ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాడు.
ఆ తర్వాత టీటును సురేశ్ వర్మ ఇంటికి తీసుకెళ్లగా, అక్కడున్న ఒక చెట్టును చూపించి, “ఇక్కడ బంగారు నాణేలున్నాయి” అన్నాడు. నిజంగానే చెట్టును తవ్వితే, పాత కాలపు బంగారు నాణేలు బయటపడ్డాయి. సురేశ్ వర్మ కొన్ని అక్రమ వ్యాపారాల్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కొంత నల్లధనం అతను దాచి పెట్టాడు అనే అనుమానాలున్నాయి. ఈ సంఘటనతో టీటుపై, అతని మాటలపై మరింత నమ్మకం ఏర్పడింది.
అంతేకాకుండా, టీటు ప్రవర్తన కూడా సురేశ్ స్వభావానికి సరిపోతుండేది. ఓసారి టీటు తండ్రితో కలిసి బజార్ కు వెళ్ళినప్పుడు, కూరగాయలు కొనడానికి అతని తండ్రి డబ్బు ఇవ్వగా… టీటు అమ్మకందారిని బెదిరించాడు“డబ్బు తీసుకోకు… నేను ఇస్తా…” అని. టీటు ప్రవర్తన, అతని మాటల తీరులో సురేష్ వర్మ లాగా ఓ అధికారం, ఓ ఆగ్రహం కనిపించింది.
ఆ సమయంలోనే టీటు మరో సంచలన వ్యాఖ్య చేశాడు. తన పూర్వజన్మ మిత్రుడే, సురేశ్ వ్యాపార భాగస్వాముల్లో ఒకరే తనను చంపాడని ఆరోపించాడు. ఈ విషయాన్ని కోర్టులో వెల్లడించే అవకాశం టీటుకి ఇచ్చారు. నాలుగేళ్ల వయసులోనే టీటు కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. తనను ఎలా చంపారో, బుల్లెట్ తలలో ఎక్కడ తగిలిందో వివరంగా వివరించాడు.
పోస్ట్‌మార్టం రిపోర్టు చూసిన న్యాయమూర్తి, టీటు చెప్పిన వివరాలు సరిగ్గా సరిపోతున్నాయని గుర్తించారు. అంతేకాకుండా, టీటు తలపై ఉన్న birth marks కూడా సురేశ్‌కు తగిలిన బుల్లెట్ గాయాల స్థానాల్లో ఉండటం గమనించారు. ఇది చూసిన పరిశోధకులు… birth marks పూర్వజన్మ గాయాలకు సంబంధం ఉంటాయనే కొత్త అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ కేసు ఆధారంగా, ఆగ్రా కోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. టీటు వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుని, ఒక నిందితుడికి పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇది భారత చరిత్రలో ఒక కీలక ఘటనగా నిలిచింది. పునర్జన్మ ఆధారంగా తీసిన మొట్టమొదటి న్యాయ తీర్పు ఇదే.
ఇది చూసి కొంతమంది టీటు కుటుంబాన్ని విమర్శించారు. “ఇది అంతా డబ్బు కోసం వేసిన డ్రామా…” అంటూ ఆరోపించారు. కానీ ఒక చిన్నపిల్లాడు, మృతుడి కుటుంబ గుట్టులు, చనిపోయిన తీరును, బంగారం దాచిన చోటు, కార్ మారిన విషయాలను ఎలా చెబుతాడు? ఇప్పటికీ ఈ కేసు ఒక మిస్టరీగానే మిగిలింది.
శాస్త్రపరంగా విశ్లేషించినా… సమాధానం మాత్రం మిస్టరీగానే మిగిలింది: మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీటూ తలపై రెండు birthmarks ఉన్నాయి. ఒకటి కుడి కనుపాప పక్కన, మరొకటి తల వెనుక భాగంలో. ఇవి సురేష్ వర్మకు తగిలిన బుల్లెట్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ వుండ్స్ కు సరిపోతున్నాయి. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ప్రకారం సురేష్ బుల్లెట్ తాకి మరణించాడు, ఇది అధికారికంగా రికార్డ్ అయిన విషయం. టీటూ తల దగ్గర కూడా గాయాల స్థానాలకు సరిపోయే birthmarks కనిపించాయి.
ఈ విషయంపైనా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకటి ఇది ‘replacement’ case కావచ్చని. అంటే ఒక ఆత్మ మరొకరి శరీరంలో ప్రవేశించడాన్ని హిందూ మతం ‘పరకాయ ప్రవేశం’ అంటుంది. టీటూ ఎనిమిది నెలల వయసులో తీవ్రమైన జ్వరంతో బాధపడిన తర్వాత అతని ప్రవర్తనలో మార్పులు వచ్చాయని కుటుంబ సభ్యులు గుర్తించారు. అంటే, అప్పటి నుంచి టీటూ సురేష్ వర్మ లాగా మారిపోయాడని భావిస్తున్నారు.
Delhi Universityకి చెందిన డా. SK చద్దా, మరియు అమెరికాలోని Virginia Universityకి చెందిన డా. అంటోనియా మిల్స్ ఈ కేసును స్వయంగా పరిశీలించారు. బుల్లెట్ తగిలిన ప్రదేశంలో birthmarks ఉండటం, వ్యక్తిత్వ లక్షణాలు, జ్ఞాపకాలు అన్నీ చూసిన తర్వాత ఇది పునర్జన్మ యొక్క అత్యంత శక్తివంతమైన కేసు అని పేర్కొన్నారు.
ఈ కేసు అంతర్జాతీయ గుర్తింపును పొందింది. Reincarnation International అనే బ్రిటిష్ మాగజైన్‌లో ప్రచురితమైంది. 1990లో BBC Forty Minutes అనే కార్యక్రమంలో టెలికాస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో Desi Crime Podcast ఈ కథపై పూర్తి ఎపిసోడ్ కూడా విడుదల చేసింది.
ప్రస్తుతం టీటు ఏం చేస్తున్నాడు?: ప్రస్తుత టీటు వయస్సు దాదాపు 42 ఏళ్లు. జీవితం మళ్లీ సాధారణమైన పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సురేశ్ వర్మ వ్యాపారం మరిచిపోయి, టీటు తన జీవితాన్ని ఒక నూతన దిశగా మలుచుకున్నాడు. ఆయన MD in Yoga and Naturopathy పూర్తి చేసి, 2012 నుండి పతంజలి యూనివర్సిటీ లో డీన్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం naturopathy మరియు yoga therapy subjects బోధిస్తున్నారు.
2024లో వచ్చిన ఓ పోడ్కాస్ట్‌లో అతను మాట్లాడుతూ – “అది కల కాదేమో… నేను మరణించిన రోజు నుంచి నాకు అన్నీ గుర్తే… అది మర్చిపోవడం అంత ఈజీ కాదు…” అన్నాడు. ప్రస్తుతం టీటు ఒక సాధారణ జీవితం గడుపుతున్నాడు. కానీ అతని చిన్ననాటి గుర్తుల వల్ల అతని కథ ప్రపంచాన్ని ఆకర్షించింది. పత్రికల్లో, డాక్యుమెంటరీల్లో ఈ కథ చెక్కుచెదరకుండా నిలిచింది.
సురేశ్ వర్మ మరణించిన తరువాత అతని ఆత్మ, టీటు శరీరంలోకి ప్రవేశించిందనే నమ్మకాన్ని కలిగించిన ఈ కథ… పునర్జన్మ పై ఉన్న ఆధారాలు, అనుమానాలు, చర్చలు మానవ ఆధ్యాత్మికతకు కొత్త దారులు చూపించాయి.
ఈ కథ పునర్జన్మలో నమ్మాలో లేదో అనే ప్రశ్నను మన అందరిలో ఒక సందేహాన్ని లేవనెత్తింది. ఇది మన ఆత్మల ప్రయాణం గురించి ఆలోచింపజేస్తుంది. మనం ఎవరం? మన జ్ఞాపకాలు ఎంత వరకు మనవి? ఒక జన్మ ముగిసిన తర్వాత మరొకదాని జన్మ మొదలు నిజమేనా? అని ప్రశ్నించేలా చేస్తుంది.
ఈ కథకు ఒక సరైన ముగింపు లేకపోయినా, టీటూ సింగ్ జీవితం మనకు చెప్పే సందేశం స్పష్టంగా ఉంది, అది ఏంటంటే అన్నీ శాస్త్రంతో ఒప్పించలేము అని. కొన్ని విషయాలను అర్థం చేసుకోకపోయినా, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. జీవితం ఒక అద్భుతమైన మిస్టరీ. ప్రతి అడుగు ఒక ప్రశ్న, ప్రతి మౌనం ఒక జవాబు.
Also Read: భారత ప్రజాస్వామ్యానికి చీకటి అధ్యాయం.! ఎమర్జెన్సీకి 50 ఏండ్లు..
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS