India’s First Half of 2025: 2025 తొలి ఆరు నెలల్లో భారతదేశాన్ని వణికించిన 6 అతిపెద్ద విపత్తులు

India’s First Half of 2025: 2025… ఈ సంవత్సరం ఇంకా పూర్తికాకముందే, దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఒక్కో నెల గడుస్తున్న కొద్దీ… ఒక్కో విపత్తు మనపై భయానక ముద్ర వేసింది. గుళ్లల్లో భక్తుల రద్దీ… స్టేడియాల్లో అభిమానుల ఉత్సాహం… విమానాల్లో ప్రయాణం… అన్నీ ఒక్క క్షణం లోనే విషాదం మారాయి. తప్పిదాలూ, నిర్లక్ష్యాలూ, ఉగ్రవాద అరాచకాలూ కలిసి... జనవరి నుంచి జూన్ దాకా దేశాన్ని వణికించాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారతదేశం అనుభవించిన ఆరు అతిపెద్ద విపత్తుల గురించి తెలుసుకుందాం.!

1. కుంభమేళా తొక్కిసలాట - ప్రయాగ్‌రాజ్ (జనవరి 29): ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహాకుంభమేళాలో మౌనీ అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లోని సంగమఘాట్ వద్ద భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరిగింది. బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర స్నానానికి కోట్లాది మంది తరలివచ్చారు. అయితే హఠాత్తుగా జరిగిన తొక్కిసలాటలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 60 మంది గాయపడ్డారు. కార్యక్రమానికి 660 మిలియన్ల (66 కోట్ల) పైగా భక్తులు హాజరవడంతో, భద్రతా చర్యలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇది ప్రభుత్వ ప్రణాళికల లోపాలను, ప్రజా భద్రతా వ్యవస్థల బలహీనతను బట్టబయలు చేసింది.

2. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట, ప్రయాగ్‌రాజ్ ఎస్‌యూవీ ప్రమాదం (ఫిబ్రవరి 15): ఒకే రోజు, రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఘోర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కుంభమేళాకు వెళ్లే భక్తులతో నిండి ఉన్న ప్లాట్‌ఫాం వద్ద, ఒక తప్పుడు అలర్ట్‌ వల్ల గందరగోళం నెలకొంది. దాంతో జరిగిన తొక్కిసలాటలో 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 14 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అదే సమయంలో, ప్రయాగ్‌రాజ్‌లో కుంభస్నానానికి వెళ్తున్న 10 మంది భక్తులతో కూడిన ఓ ఎస్‌యూవీ, వేగంగా వస్తున్న బస్సును ఎదురెదురుగా ఢీకొట్టింది. ఈ ఘర్షణలో ఎస్‌యూవీలో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రెండు సంఘటనలు కలిపి మరణాల సంఖ్యను మరింత పెంచాయి.

3. గుజరాత్  బాణాసంచా ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం – బాయిలర్ పేలుడు (ఏప్రిల్ 1): గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంతా జిల్లాలోని దిసా పట్టణంలో ఉన్న ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో, ఏప్రిల్ 1న బాయిలర్ పేలి పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు మొత్తం యూనిట్‌ను చుట్టేసాయి. లోపల పని చేస్తున్న 21 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని బయటకు రావడానికి అవకాశం లేకుండా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వల్ల పరిశ్రమల భద్రతా ప్రమాణాల్లో ఉన్న తీవ్ర లోపాలు బట్టబయలయ్యాయి. ప్రమాదకరమైన ఉత్పత్తుల పరిశ్రమలపై ఉన్న నియంత్రణలలో బలహీనతపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

4. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి – పహల్గాం (ఏప్రిల్ 22): ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో, పాకిస్తాన్‌కు చెందిన సాయుధ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. వారు ముందుగా పర్యాటుకుల మతాన్ని అడిగి గుర్తించిన తరువాతే కాల్పులు ప్రారంభించారు. ఈ దాడిలో అనేక మంది హిందూ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇండోర్ కు చెందిన ఒక క్రిస్టియన్ వ్యక్తి, అలాగే యాత్రికులను కాపాడేందుకు ప్రయత్నించిన ఒక స్థానిక ముస్లిం గైడ్ కూడా ఉన్నారు. ఈ దాడికి స్పందనగా భారత ఆర్మీ “ఆపరేషన్ సిందూర్” పేరుతో దాడులు చేపట్టింది. ఇందులో భారత దళాలు సరిహద్దు దాటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.

5. ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట – బెంగళూరు (జూన్ 4): జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ లో 18 ఏళ్ల తర్వాత మొదటిసారి గెలిచిన సందర్భంగా నిర్వహించిన సెలబ్రేషన్‌కి ముందు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టేడియం బయట భారీగా అభిమానులు గుమిగూడడంతో, ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పడిన పెద్ద తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందారు, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతి పెద్ద సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా రావడం, మరియు సమర్థవంతమైన క్రమపద్ధతి లేకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ప్రవేశ మార్గాల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు, తొక్కిసలాటలు పరిస్థితిని పూర్తిగా అదుపు తప్పేలా చేశాయి. ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన కార్యక్రమం ఇలా విషాదానికి దారితీసింది.

6. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం – అహ్మదాబాద్ (జూన్ 12): జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటల సమయంలో అహ్మదాబాద్‌లో టేక్ ఆఫ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో మొత్తం 242 మంది కన్నుమూశారు. ఇందులో భారతీయులు 169 మంది ఉన్నారు. బ్రిటిష్ దేశానికి చెందినవారు 53 మంది ఉన్నారు. పోర్చుగీసుదేశానికి చెందినవారు ఏడుగురు, కెనడా దేశానికి చెందినవారు ఒక్కరు ఉన్నారు.. విమానం నడిపే పైలెట్స్ ఇద్దరు, ఎయిర్ హోస్టర్స్ పదిమంది ఉన్నారు.. గుజరాత్ ఆర్థిక రాజధానిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే ఇది ఇది ఇప్పటివరకు 2025లో జరిగిన అతి ఘోరమైన దుర్ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా తీవ్ర శోకం అలుముకుంది. విమాన భద్రతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించారు.

2025 సంవత్సరం మొదటి సగ భాగం భారతదేశానికి అత్యంత బాధాకరంగా నిలిచింది. కుంభమేళా తొక్కిసలాటల నుంచి విమాన ప్రమాదం వరకు ఎన్నో ప్రాణాలు పోయాయి, కుటుంబాలు కకావికలం అయ్యాయి. దేశమంతా విషాదంలో మునిగిపోయింది. ఈ వరుస విపత్తులు మన దేశ భద్రతా వ్యవస్థల మీద, మౌలిక సదుపాయాల మీద, మరియు అత్యవసర చర్యలపై మళ్లీ ప్రశ్నలు కలిగించాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను ముఖ్యంగా పరిగణించి, పెద్ద స్థాయిలో భద్రతా, అవగాహన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విపత్తుల నుంచి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే కానీ... మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక్క జాగ్రత్తే - ఎన్నో ప్రాణాలు కాపాడగలదు.

మరిన్ని లేటెస్ట్ అప్డేస్ట్స్ కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS


Post a Comment (0)
Previous Post Next Post