Palnati Yuddham: పల్నాడు యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా?

Palnati Yuddham: పల్నాటి సీమలోని రణక్షేత్రమైన ఒకప్పటి కార్యంపూడి, నేటి కారంపూడి అసలైన పౌరుషాల పురిటిగడ్డ. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకుంటూ జరిగే వేడుకలకే పల్నాటి వీరాచార ఉత్సవాలు అంటారు. ప్రపంచంలో రోమ్ దేశంలో జరిగే ఇలాంటి ఉత్సవాలు, భారతదేశంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా కారంపూడిలో ఐదు రోజుల పాటు జరగటం ప్రత్యేకం.

Palnati Yuddham
Palnati Yuddham

ఉత్సవాల ఆరంభం - కార్తీక పౌర్ణమి నుంచి అమావాస్య వరకు
కార్తీక పౌర్ణమి నాడు పోతురాజుకు పడిగాం కట్టడం ద్వారా ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అనంతరం కార్తీక అమావాస్య నుంచి ప్రధాన ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాచగావు, రాయబారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు అనే నామాలతో ఈ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయి.

11వ శతాబ్దంలో కారంపూడి నాగులేరు వడ్డున గల రణభూమిలో యుద్ధం జరిగినట్లు చరిత్ర చెబుతుంది. అదే కారణంగా పల్నాటి యుద్ధం ఐదు రోజుల పాటు కార్తీక అమావాస్యనుంచి సాగిందనీ, అందువల్లే ఉత్సవాలు కూడా అదే ఐదు రోజుల పాటు జరుగుతాయని పల్నాటి వీరాచార పీఠం తెలియజేస్తుంది.

వీరుల స్మరణ - వీర్ల దేవాలయ నిర్మాణం
కారంపూడికి గొప్ప చరిత్ర ఉంది. యుద్ధంలో వీరులుగా నిలిచిన అమరులను స్మరించేందుకు వీరుల దేవాలయం నిర్మించారని ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ భాద్యతను పిడుగు వంశం వారికి అప్పగించినట్లు, బ్రహ్మనాయుడే ఆ బాధ్యతలను వారికప్పగించాడని చరిత్ర సూచిస్తుంది.

Battle of Palnadu
Battle of Palnadu

పల్నాటి చరిత్ర - మహాభారతాన్ని తలపించే ఘట్టాలు
మహాభారతాన్ని తలపించేదే పల్నాటి చరిత్ర. ఈ యుద్ధానికి అనేక కారణాలున్నాయి. అలుగురాజు పాలనలో గురజాలను రాజ్యంగా ఏర్పరచుకుని, బ్రహ్మనాయుడు మంత్రివర్గంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సమయంలో నాగమ్మ ఆతిథ్యం స్వీకరించి కానుక కోరుకోవడం, తరువాత అలుగురాజు కుమారుడు నలగమూడి పాలనలో మంత్రి పదవి కానుకగా అడగడం వంటి సంఘటనలతో పల్నాటి చరిత్రకు అంకురార్పణ జరిగింది.

ప్రజల్లో సమసమాజ స్థాపనకు వైష్ణవమతాన్ని ప్రబోధిస్తూ బ్రహ్మన్న ప్రజాదరణ పొందగా, శైవమత ప్రచారకురాలిగా నాగమ్మ పల్నాడు ప్రాంతంలో ప్రభావం సంపాదించింది. ఈ రెండు మతాల మధ్య విభేదాలు రాజ్యాల మధ్య కూడా విభజనకు దారితీశాయి.

రాజ్యాల విభజన - నలగామరాజు మరియు మలిదేవులకు పంపకాలు
పల్నాటి రాజ్యం రెండు ముక్కలైంది. అలుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామరాజుకు గురజాల రాజ్యం, రెండవ భార్య సంతానమైన మలిదేవులకు మాచర్ల రాజ్యం అప్పగించారు. మాచర్లకు బ్రహ్మనాయుడు మంత్రిగా, గురజాలకు నాగమ్మ నాయకురాలిగా వ్యవహరించారు.

దాయాదుల పోరు - కుట్రలు, కుతంత్రాలతో ప్రారంభమైన యుద్ధం
నాగమ్మ పన్నిన కుట్రల వల్ల బ్రహ్మనాయుడు వనవాసానికి వెళ్లినట్లు చరిత్ర తెలియజేస్తుంది. కోడిపోరులో ఓటమి కారణంగా మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధి కోసం వెళ్లిన ప్రతినిధి చల్లగుడిపాడు వద్ద హత్యకు గురవడం పరిస్థితులను మరింత విషమం చేసింది. ఈ సంఘటనతో రెండు రాజ్యాల మధ్య వైరం గరిష్ఠానికి చేరి పల్నాటి యుద్ధం జరిగింది.

సమసమాజ స్థాపనలో బ్రహ్మనాయుడు పాత్ర
కులమతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు మాచర్ల రాజ్యాన్ని రక్షించాడు. సమసమాజం కోసం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి, దళిత యువకుడు కన్నమదాసును దత్తపుత్రునిగా స్వీకరించి, ఒక వీరునిగా తీర్చిదిద్దిన ఘనత బ్రహ్మనాయుడికి చెందింది. ఇదే నాగమ్మకు అసహ్యత కలిగించి ఆమె రాజకీయ కుతంత్రాలకు దారి తీసిందని చరిత్ర చెబుతుంది.

ఉత్సవాల మహిమాన్వితం - నేటికీ కొనసాగుతున్న ఐదు రోజుల వీరారాధన
ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వీరాచారవంతులు కార్తీక అమావాస్యనాడు రణక్షేత్రమైన కారంపూడికి చేరుకుంటారు. ఐదు రోజుల పాటు యుద్ధ ఘట్టాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శనలు ఇస్తూ, అమర వీరులను స్మరించుకుంటారు. దాయాదుల పోరు, మత విభేదాలు, రాజకీయం, ధర్మసంకటాలు వీటన్నింటి మేళవింపే పల్నాటి యుద్ధం.


Post a Comment (0)
Previous Post Next Post