Upasana Konidela: ఉపాసన కొణిదెల తాజా పోస్ట్‌పై సోషల్ మీడియాలో చర్చలు.!

Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో సీఆర్‌ఎస్ వైస్ ఛైర్మన్ ఉపాసన కొణిదెల ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట విస్తృత చర్చకు కారణమైంది. ఐఐటీ విద్యార్థులతో జరిగిన సమావేశం అనంతరం ఆమె పెట్టిన వివాహానికి సంబంధించిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో, నెటిజన్స్‌తో పాటు జోహో సీఈఓ శ్రీధర్ వెంబు కూడా స్పందించారు. కొందరు ఆమె వ్యాఖ్యలను విమర్శించగా, మరికొందరు మద్దతు తెలిపారు.

Upasana Konidela
Upasana Konidela

చర్చల నేపథ్యంలో మరోసారి స్పందించిన ఉపాసన
వివిధ కోణాల్లో వస్తున్న స్పందనలపై ఉపాసన మరోసారి రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యల ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చెబుతూ సోషల్ మీడియాలో కొత్తగా పోస్ట్ చేశారు. “నా పోస్ట్ పై ఆరోగ్యకరమైన చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నాను. స్పందించిన అందరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె సమాజంలో మహిళలపై ఉండే ఒత్తిళ్లను ప్రశ్నిస్తూ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ముందుకు తెచ్చారు.

Also Read: మళ్లీ అమ్మ కానున్న బాలీవుడ్ గ్లామర్ క్వీన్ సోనమ్ కపూర్!

ఉపాసన ప్రశ్నలు - మహిళల ఎంపికలకు గౌరవం ఇవ్వాలనే సందేశం
తన వివాహం, సంతానం, వ్యక్తిగత నిర్ణయాలపై వచ్చిన చర్చల నేపథ్యంలో ఉపాసన ఇలా ప్రశ్నించారు - ఒక స్త్రీ సమాజ ఒత్తిడికి లొంగకుండా ప్రేమ వివాహం చేసుకోవడం తప్పా?
సరైన భాగస్వామి దొరికే వరకు వేచి ఉండటం తప్పా? ఒక స్త్రీ తన స్వంత పరిస్థితుల ఆధారంగా ఎప్పుడు పిల్లలను కనాలనేదాన్ని నిర్ణయించుకోవడం తప్పా? వివాహం లేదా చిన్న వయస్సులో పిల్లలు అనే ఒత్తిడి లేకుండా కెరీర్‌పై దృష్టి పెట్టడం తప్పా? ఈ ప్రశ్నలతో ఆమె మహిళల వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు.

తన జీవిత ప్రయాణాన్ని వివరించిన ఉపాసన
ఉపాసన తన వ్యక్తిగత టైమ్‌లైన్‌ను కూడా పంచుకున్నారు.27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు.
29 ఏళ్ల వయసులో వ్యక్తిగత, ఆరోగ్య కారణాల వల్ల తన అండాలను ఫ్రీజ్ చేసుకున్నారు. 36 ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో, త్వరలోనే కవలలకు జన్మనివ్వనున్నట్టు వెల్లడించారు. పెళ్లి, కెరీర్ ఒకదానితో ఒకటి పోటీ కాదని, ప్రతి చాప్టర్‌కు తనదైన సమయం ఉంటుందని ఆమె స్పష్టంచేశారు.

ఐఐటీలో చేసిన వ్యాఖ్యలపై స్పందనలు
ఇటీవల హైదరాబాద్ ఐఐటీని సందర్శించిన ఉపాసన, అక్కడి విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్ వీడియోను షేర్ చేశారు. “పెళ్లి చేసుకుంటున్నారా?” అనే ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తడం తనను ఆశ్చర్యపరిచిందని, మహిళలు కెరీర్‌పై దృష్టి పెట్టడం కొత్త భారత వైఖరిని సూచిస్తుందని అన్నారు. అలాగే అండాలు ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మహిళలకు కుటుంబ ప్రణాళికపై మరింత స్వేచ్ఛ వస్తుందని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఉపాసన ఇచ్చిన తాజా వివరణతో చర్చ మరింత వేడెక్కింది.


Post a Comment (0)
Previous Post Next Post