Actress Pratyusha Death Mystery: రెండు దశాబ్దాల తరువాత మళ్లీ తెరపైకి వచ్చిన సంచలన కేసు!

Actress Pratyusha Death Mystery: దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన ఘటన. హీరోయిన్ ప్రత్యూష ఆత్మహత్య అప్పట్లో ఇండస్ట్రీకే కాదు, కోట్లాది ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి, అలాగే నిందితుడికి విధించిన శిక్షను పెంచాలని కోరుతూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్స్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్) తీర్పును రిజర్వ్ చేసింది.

Actress Pratyusha Death Mystery
Actress Pratyusha Death Mystery

ప్రత్యూష-సిద్ధార్థ రెడ్డి ప్రేమకథ నుండి విషాదాంతం వరకు
సినిమాల్లోకి అడుగుపెట్టే ముందే ప్రత్యూష తన ఇంటర్ ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డితో ప్రేమలో పడింది. ఇంటర్ అనంతరం ప్రత్యూష చిత్రాల్లో నటించడం ప్రారంభించగా, సిద్ధార్థ రెడ్డి ఇంజినీరింగ్ చదువులో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.30 నుండి 8 గంటల మధ్యలో వీరిద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. తరువాత 24న ప్రత్యూష మృతి చెందగా, చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు.

విషపరీక్షలు, వైద్యుల నివేదికలు, చేసిన కీలక నిర్ధారణలు
వారిద్దరూ తాగిన కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ఆర్గానోఫాస్ఫేట్‌ కారణంగానే ప్రత్యూష మరణించిందని, ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయడమో, లేదా మరణానికి ముందు లైంగికదాడో జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదించింది.

సీబీఐ దర్యాప్తు, ఆరోపణలు, ప్రారంభ కోర్టు తీర్పు
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేసి, సిద్ధార్థ రెడ్డిపై IPC సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 309 (ఆత్మహత్యా యత్నం) కింద చార్జిషీట్ దాఖలు చేసింది. 2004 ఫిబ్రవరి 23న హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.

హైకోర్టు తీర్పు - శిక్ష తగ్గింపు, జరిమానా పెంపు
ఈ తీర్పుపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో అప్పీల్ చేయగా, కోర్టు జైలు శిక్షను ఐదేళ్ల నుండి రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టులో పెండింగ్ అప్పీలు
2012లో సిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఇద్దరూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.
సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది నచికేత జోషి వాదిస్తూ కేసులోని సాక్ష్యాధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయని, ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, లేకపోతే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష ఇవ్వాలని కోరారు. ఇక సిద్ధార్థ రెడ్డి తరఫున న్యాయవాదులు నాగముత్తు, ఎల్. నరసింహారెడ్డి వాదిస్తూ ఇద్దరూ కలిసి పురుగుమందు తాగినందున, ‘ప్రేరేపణ’ అనే అంశం అసలు నిలవదని చెప్పారు.

Also Read: పాన్ ఇండియా సినిమాలను దీపికా పదుకొణె ఎందుకు తిరస్కరించింది?

Post a Comment (0)
Previous Post Next Post