Putin to visit India for Annual Summit: పుతిన్ భారత పర్యటన.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు!

Putin to visit India for Annual Summit: డిసెంబర్ 4 నుండి 5 వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పాటు భారత్ పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు పుతిన్ ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించనున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పర్యటనను ధృవీకరిస్తూ ఇది ఇరు దేశాల నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యమైన సందర్భమని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకునే అవకాశమని ప్రకటించింది.

Putin to visit India for Annual Summit
Putin to visit India for Annual Summit

రక్షణ సహకారం ప్రధాన అంశం.. S-400 వ్యవస్థలు, Su-57 యుద్ధవిమానాలు
ఈ శిఖరాగ్ర సమావేశంలో రక్షణ అంశాలు ముఖ్య చర్చాంశాలుగా నిలవనున్నాయి. ముఖ్యంగా S-400 క్షిపణి వ్యవస్థలు ఆపరేషన్ సింధూర్ సమయంలో అధ్బుతంగా పనిచేయడంతో, భారత్ మరిన్ని S-400 వ్యవస్థలను కొనుగోలు చేయాలని పరిశీలిస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న డెలివరీల ఆలస్యం పెద్ద సమస్యగా మారింది. ఈ జాప్యానికి గల కారణాలు, మిగతా డెలివరీలు ఎప్పుడు పూర్తవుతాయన్న విషయంపై భారత్ రష్యాతో స్పష్టమైన వివరణ కోరనుంది అని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.

అదేవిధంగా, రెండు స్క్వాడ్రన్ల అత్యాధునిక Su-57 యుద్ధవిమానాల కొనుగోలు అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. UH, సుఖోయ్ అప్‌గ్రేడేషన్ వంటి ప్రధాన రక్షణ ప్రాజెక్టుల్లో ఉన్న జాప్యాలను సమీక్షించి, వాటి పురోగతిని వేగవంతం చేయడంపై కూడా ఇరు దేశాలు దృష్టి పెట్టనున్నాయి.

Also Read: "తెలంగాణ ఉద్యమం" చరిత్రలో చెరగని అధ్యాయం!

చమురు సరఫరాలు, ఉక్రెయిన్ వివాదం
పుతిన్ పర్యటనలో అంతర్జాతీయ జియోపాలిటికల్ అంశాలు కీలకంగా ఉండనున్నాయి. యూఎస్ ఆంక్షల ప్రభావంతో భారత్ ఇటీవల రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించింది. ఈ నేపథ్యంలో భారత్ తిరిగి భారీగా చమురు దిగుమతి చేసుకునేందుకు రష్యా అదనపు డిస్కౌంట్‌లను ఆఫర్ చేసే అవకాశముంది.

ఉక్రెయిన్ విషయంలో భారతదేశం యుద్ధం త్వరగా ముగియాలని, శాశ్వత శాంతి స్థాపించాల్సిన అవసరం ఉందని పలుమార్లు స్పష్టం చేసింది. ఈ శాంతి మార్గాల గురించి కూడా మోదీ-పుతిన్ సమావేశంలో ప్రత్యేక చర్చ జరగనుంది. ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో చేసిన చర్చలో కూడా భారత్ సమాధానకరమైన పరిష్కారానికి మద్దతు తెలుపింది. ఈ అంశం పుతిన్ పర్యటనలో ప్రధాన ప్రాధాన్యాన్ని పొందనుంది.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం
భారత్-రష్యా సంబంధాలు దశాబ్దాలుగా విశ్వాసపూరిత స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆధారపడి కొనసాగుతున్నాయి. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య రాజకీయ, రక్షణ, ఇంధన రంగాల్లోని సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పుతిన్ గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేయనున్నారు.

పుతిన్ చివరిసారిగా డిసెంబర్ 2021లో భారత్‌ను సందర్శించారు. ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ పర్యటన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.


Post a Comment (0)
Previous Post Next Post