Andhra Pradesh Cyclone Alert: ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి తుపాన్ ముప్పు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక!

Andhra Pradesh Cyclone Alert: ఆంధ్ర రాష్ట్రంపై మరో తుపాన్ ముప్పు తలెత్తే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. మొంథా తుపాన్ విధ్వంసం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే, మరోసారి భారీ వర్షాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టనున్నాయని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 22 (శనివారం) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారి బలపడే పరిస్థితి ఉంది. ఆ తర్వాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా మరింతగా పురోగమిస్తూ నైరుతి బంగాళాఖాతంలో అధిక తీవ్రతను సంతరించుకోనున్నట్టు అంచనా.

Andhra Pradesh Cyclone Alert
Andhra Pradesh Cyclone Alert

నవంబర్ 27-29 మధ్య భారీ వర్షాలు - విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం
ఈ తుపాన్ ప్రభావం వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల రూపంలో కన్పించనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నవంబర్ 27 నుండి 29 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 42 50101లను ప్రభుత్వం విడుదల చేసింది.

కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచనలు జారీ చేసింది.

తెలంగాణలో కూడా వర్ష సూచనలు
తెలంగాణలో కూడా తీవ్రమైన వాతావరణ మార్పుల సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నవంబర్ 23 నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా. నవంబర్ 21, 22 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉండనున్నప్పటికీ, చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. నవంబర్ 23 నుండి 25 వరకు వర్షాలు పడే అవకాశం ఉండగా, రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2-3 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.


Post a Comment (0)
Previous Post Next Post