Akkineni Amala: అక్కినేని అమల చెప్పిన అరుదైన వ్యక్తిగత విషయాలు!

Akkineni Amala: అక్కినేని నాగార్జున సతీమణి అమల, ఇటీవల తన గత జీవితం, కుటుంబ నేపథ్యం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగార్జున-అమల జంటగా నటించిన కల్ట్‌ క్లాసిక్‌ ‘శివ’ 36 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్ననాటి జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. బెంగాల్ విభజన సమయంలో తన తండ్రి సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో ప్రాణాలు తీసుకుని పారిపోయి వచ్చారని భావోద్వేగంగా చెప్పారు.

Akkineni Amala
Akkineni Amala

బెంగాల్ విభజన - అమల కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు
“మా అమ్మ ఐరిష్, నాన్న బెంగాలీ. బెంగాల్ విభజన సమయంలో మా ఆస్తులన్నీ పోయాయి. బాగా చదువుకుంటేనే జీవితంలో పైకి రావచ్చని నాన్న నమ్మకం. అందుకే కష్టపడి చదివి యూకేలో నౌకాదళంలో ఉద్యోగం సంపాదించారు. ఆయన తన తొమ్మిది మంది తోబుట్టువుల బాధ్యతను కూడా తీసుకున్నారు” అని అమల వివరించారు. తల్లిదండ్రులిద్దరూ నౌకాదళంలో పనిచేయడం వల్ల తరచూ ఊళ్లు మారిన విషయాన్ని కూడా ఆమె చెప్పారు. వైజాగ్‌లో ఉన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నానని వెల్లడించారు.

Also Read: శోభిత, జైనబ్ నా జీవితం సంతోషంగా మార్చేశారు.. అమల షాకింగ్ కామెంట్స్!

కళాక్షేత్రలో పదేళ్ల శిక్షణ - అమల కళా ప్రయాణం
తన డ్యాన్స్ టీచర్ సలహాతో 9 ఏళ్ల వయసులో చెన్నైలోని కళాక్షేత్రలో చేరినట్లు, 19 ఏళ్ల వరకు అక్కడే చదువుకున్నట్లు అమల పేర్కొన్నారు. “మా ఇంట్లో పనివాళ్లు ఉండేవారు కాదు. గిన్నెలు తోమడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట చేయడం… ఇవన్నీ మేమే చేసుకునేవాళ్లం” అని ఆమె తన నిరాడంబరమైన పెంపకం గురించి చెప్పారు. దర్శకుడు టి. రాజేందర్ క్లాసికల్ డ్యాన్సర్ కోసం వెతుకుతూ కళాక్షేత్రకు వచ్చినప్పుడు తనను గుర్తించి, ‘మైథిలి ఎన్నయి కథలై’ చిత్రంతో హీరోయిన్‌గా నటించే అవకాశం లభించిందని, ఆ సినిమా విజయంతో తిరిగి వెనుదిరిగి చూడలేదని అమల చెప్పారు.

అక్కినేని కుటుంబం గురించి అమల హృదయపూర్వక మాటలు
అక్కినేని కుటుంబంపై మాట్లాడిన అమల, అత్తగారు అన్నపూర్ణమ్మ తనను కూతురిలా చూసుకున్నారని, ఆమె నుంచే శుద్ధంగా తెలుగు నేర్చుకున్నానని చెప్పారు. నాగచైతన్య, అఖిల్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోమని, వారి ఇష్టాలను గౌరవిస్తామని స్పష్టం చేశారు. “నాకు మంచి కోడళ్లు దొరకడం నా అదృష్టం” అని అమల ఆనందం వ్యక్తం చేశారు.


Post a Comment (0)
Previous Post Next Post