Parenting Tips: పిల్లల ముందు పేరెంట్స్ అస్సలు మాట్లాడకూడని విషయాలు!

Parenting Tips: ప్రతి తల్లిదండ్రి తన పిల్లలు మంచివాళ్లుగా, తెలివిగా, ఆత్మవిశ్వాసంతో పెరగాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు మనం గుర్తించకుండానే చేసే చిన్న చిన్న మాటలు లేదా ప్రవర్తన పిల్లల మనసుపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. పిల్లలు విన్న ప్రతి మాట, చూసిన ప్రతి ప్రవర్తన వారి వ్యక్తిత్వాన్ని మలుస్తుంది. అందుకే పిల్లల ఎదుట మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ముందు అస్సలు మాట్లాడకూడని విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. తల్లిదండ్రుల మధ్య తగాదాలు లేదా గొడవలు: పిల్లల ఎదుట తల్లిదండ్రులు గొడవపడటం, ఒకరిపై ఒకరు కోపంగా మాట్లాడటం వారికి తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. వారు భయపడతారు, అస్థిరతకు గురవుతారు. “అమ్మ నాన్న విడిపోతారా?” అనే అనుమానం కూడా వారిలో పుడుతుంది. కాబట్టి, ఏవైనా విభేదాలు ఉంటే, పిల్లల ముందర కాకుండా, వారిని దూరంగా ఉంచి మాట్లాడాలి.

2. డబ్బు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు: “ఇంట్లో డబ్బు లేదు”, “ఎంత ఖర్చు అవుతోంది”, “నీ స్కూల్ ఫీజులు చెల్లించడం కష్టమవుతోంది” వంటి మాటలు పిల్లల ఎదుట మాట్లాడకూడదు. ఇవి పిల్లల్లో నేరపూరిత భావనను కలిగిస్తాయి. తామే భారంగా ఉన్నామనే ఆలోచన వారికి వస్తుంది. దాని ఫలితంగా వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.

3. ఇతరులతో పోలికలు: “ ఆ పిల్లను చూడూ? ఎంత బాగా చదువుతుంది!”, “నీకు అంత తెలివి ఉండదా?” వంటి మాటలు పిల్లల మనసును గాయపరుస్తాయి. ప్రతి పిల్లా ప్రత్యేకమైనది. పోలికలు వేయడం వారి ప్రతిభను అణగదొక్కుతుంది. బదులుగా, వారిని ప్రోత్సహించి, చిన్న విజయాలకైనా అభినందించడం మంచిది.

4. పెద్దవాళ్ల సంబంధమైన వ్యక్తిగత విషయాలు: భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత విషయాలు, పెద్దల మధ్య జరిగే సంభాషణలు పిల్లల ముందు అస్సలు మాట్లాడకూడదు. పిల్లల వయస్సు దృష్ట్యా అవి వారికి అర్థంకాకపోవచ్చు, కానీ వారి మదిలో అనేక అనుమానాలు పుడతాయి. ఇది వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

5. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం: ఇంట్లో బంధువులు, పొరుగువాళ్లు లేదా టీచర్లు గురించి చెడుగా మాట్లాడితే పిల్లలు అదే అలవాటు అలవరచుకుంటారు. తరువాత వారు కూడా ఇతరులను విమర్శించే స్వభావం ఏర్పడుతుంది. అందుకే పిల్లల ఎదుట ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.

6. తల్లిదండ్రుల పరస్పర అవమానాలు: “నీ నాన్న దేనికి పనికిరాడు”, “మీ అమ్మ వల్లే ఇలాగే అయింది” వంటి మాటలు పిల్లల మనసును తీవ్రంగా దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో తల్లిదండ్రులను ద్వేషించడానికి కూడా దారితీస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లల ఎదుట పరస్పరం అవమానించకూడదు.

7. పిల్లల తప్పులను ఇతరుల ముందు చెప్పడం: కొంతమంది పేరెంట్స్ పిల్లల పొరపాట్లను బంధువులు లేదా అతిథుల ముందర చెప్పి అవమానిస్తారు. ఇది పిల్లల్లో అవమానభావాన్ని కలిగిస్తుంది, మరియు వారు భవిష్యత్తులో తమ సమస్యలు మీతో పంచుకోవడాన్ని కూడా మానేస్తారు.

పిల్లలు తల్లిదండ్రుల మాటలనే కాదు, ప్రవర్తననూ గమనిస్తారు. మీరు ఎలా మాట్లాడుతారు, ఎలా స్పందిస్తారు అన్నది వారికి జీవిత పాఠంగా మారుతుంది. కాబట్టి, పిల్లల ఎదుట మాట్లాడే మాటల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి. ప్రేమతో, ప్రోత్సాహంతో, సానుకూల వాతావరణంలో పెరిగిన పిల్లలే భవిష్యత్తులో సమతుల్యమైన వ్యక్తిత్వం కలిగిన మంచి మనుషులుగా మారతారు.

Also Read: ఎక్కువ కాలం బ్రతకాలని ఉందా? ఈ అలవాట్లు ఇప్పుడే మొదలు పెట్టండి!

Post a Comment (0)
Previous Post Next Post