Habits for Longevity: ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం పెరగడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వలన మనిషి ఆరోగ్యంపై అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు శారీరకంగా కష్టపడి పనిచేసిన వారు ఇప్పుడు ఎక్కువగా ఒకే చోట కూర్చొని విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా, కలుషితమైన ఆహార పదార్థాల వినియోగం పెరగడంతో రోగాల బారిన పడే వారి సంఖ్య కూడా అధికమవుతోంది. అయితే, నేటి తరం ఎక్కువగా శారీరక శ్రమ చేయకపోయినా, కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా ఆయుష్షు పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
![]() |
| Habits for Longevity |
జీవన కాలంపై తాజా సర్వే వివరాలు: ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 11 శాతం మంది 60 ఏళ్లు దాటుతున్నారు, 7 శాతం మంది 65 నుంచి 70 ఏళ్ల వరకు జీవిస్తున్నారు, 5 శాతం మంది 80 ఏళ్ల దాకా చేరుతున్నారు, ఇంకా కేవలం 3 శాతం మంది మాత్రమే 80 దాటి 90 ఏళ్ల వరకు జీవిస్తున్నారు. ఈ వయస్సులో తేడాలు రావడానికి ప్రధాన కారణం వారు పాటించే జీవన విధానం, ఆరోగ్య నియమాలు అని నిపుణులు చెబుతున్నారు. మరి, ఆయుష్షు పెరగడానికి ఏం చేయాలి? ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి?
సంతోషం - ఆయుష్షుకు మూలం: “సంతోషం సగం బలం” అని పెద్దలు చెప్పిన మాట నేటికీ అప్రతిహతంగా సత్యమే. ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులతో బిజీగా మారిపోయారు. అయితే రోజులో కనీసం ఒక గంటపాటు రిలాక్స్ అయ్యే సమయం కేటాయించడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం, ఉదయపు వాకింగ్‌కు వెళ్లడం వంటి చర్యలు మానసిక ప్రశాంతతను పెంచి, ఆయుష్షును పెంచుతాయి.
స్వీట్ మరియు సాల్ట్ - మితమే మేలు: ఏ ఆహారానికైనా రుచి తెచ్చేది ఉప్పు, చక్కెర. కానీ ప్రస్తుతం బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్‌లో వీటి వినియోగం అధికమైంది. ముఖ్యంగా అధికంగా మిఠాయిలు తీసుకోవడం వలన డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు చిన్న వయస్సులోనే వస్తున్నాయి. ఈ కారణంగా ఆయుష్షు తగ్గిపోతుంది. కాబట్టి ఉప్పు, చక్కెర వినియోగాన్ని నియంత్రించడం ఆరోగ్యాన్ని కాపాడే ప్రధాన మార్గం.
వ్యాయామం - ఆరోగ్యానికి అవసరం: బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది రోజువారీ వ్యాయామాన్ని విస్మరిస్తున్నారు. కానీ ఎంత బిజీ అయినా రోజుకు కనీసం గంటపాటు వ్యాయామానికి సమయం కేటాయించాలి. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారు ప్రతి అరగంటకు ఒకసారి లేచి నడవడం వంటి చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీలైతే సైక్లింగ్ లేదా యోగా చేయడం శరీరానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
ప్రోటీన్ల ప్రాధాన్యత: ప్రతిరోజూ తినే ఆహారంలో ప్రోటీన్ల పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొవ్వు పదార్థాలు తగ్గించి, ప్రోటీన్ అధికంగా ఉన్న పప్పులు, పాలు, కూరగాయలు వంటి పదార్థాలను ఆహారంలో చేర్చాలి. ప్రోటీన్లు శరీర కణాల పునరుత్పత్తికి దోహదపడతాయి, అలాగే మృత కణాలను తగ్గించడంతో దీర్ఘాయుష్షుకు దోహదం చేస్తాయి.
పాజిటివ్ ఫీలింగ్స్ - మనసుకు ఆరోగ్యం: ఆరోగ్యంగా ఉండటానికి శరీరంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. అందుకే పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడం అవసరం. కొన్ని సందర్భాల్లో ఎదుటివారి ప్రవర్తన నచ్చకపోయినా, దానిని ప్రతికూలంగా కాకుండా సానుకూల దృక్పథంతో చూడడం మంచిది. కోపం, ద్వేషం, నెగటివ్ ఎనర్జీ మన మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. కాబట్టి పాజిటివ్ దృష్టికోణం ద్వారా జీవితం పట్ల సంతృప్తిని పెంచుకోవాలి.
ఆరోగ్యమే మహాభాగ్యం: వాతావరణ కాలుష్యం, కలుషిత ఆహారం, మరియు శారీరక శ్రమలేమీ లేని జీవనశైలి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే, సంతోషంగా ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండడం వంటి చిన్న మార్పులు పాటిస్తే మన ఆయుష్షు పెరగడంతో పాటు జీవన నాణ్యత కూడా మెరుగవుతుంది. ఆరోగ్యమే అసలైన సంపద.. దాన్ని కాపాడటమే నిజమైన విజయమని గుర్తుంచుకోండి.
Also Read: ఉదయం 4 గంటలకు లేవడం ఎందుకు అంత అవసరం?
