Hyderabad Traffic Solutions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం వైపు కొత్త దిశ!

Hyderabad Traffic Solutions: విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను నిత్యనూతనంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించడం, పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా పాలకులు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దీ తగ్గింపుపై మరింత దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఫోర్త్ సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టగా, మూసీ పునరుజ్జీవన ప్రణాళిక కూడా అమలులోకి రానుంది.

Hyderabad Traffic Solutions
Hyderabad Traffic Solutions

ట్రాఫిక్ రద్దీపై ట్రిపుల్‌ఎటీ అధ్యయనం: హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన రద్దీ, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఎటీ–హైదరాబాద్ సంస్థ ప్రత్యేక అధ్యయనం చేపట్టింది. ఇప్పటికే 21 అత్యధిక ట్రాఫిక్ పాయింట్లను గుర్తించగా, మరిన్ని ప్రాంతాలను పరిశీలించి నివేదిక సమర్పించనుంది. ఈ ప్రణాళికల ద్వారా స్కైవేలు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి దారితీయనుంది.

Also Read: ఫ్రీ బస్ నడపడం చేతకాక ఛార్జీలు పెంచుతున్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు!

ఉప్పల్‌ నుంచి మెహిదీపట్నం వరకు స్కైవేలు:
ఉప్పల్ జంక్షన్‌లో ఇప్పటికే మెట్రో స్టేషన్‌తో అనుసంధానించబడిన ఫుట్‌వే మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రస్తుతం మెహిదీపట్నంలో స్కైవే పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేఎన్టీయూ జంక్షన్ వద్ద సర్వేలు ప్రారంభమయ్యాయి. త్వరలో మియాపూర్, ఐకియా, ఎల్బీనగర్, ఐటీ కారిడార్‌లోని 10–15 కీలక కూడళ్లలో స్కైవేలు నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పీపీపీ మోడల్‌లో ప్రాజెక్టులు: నగరంలో రద్దీ ప్రాంతాల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకుండా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మోడల్లో కూడా ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వీటిలో మాల్స్, ఐటీ భవనాలు, మెట్రో స్టేషన్లతో నేరుగా కలుపుకునే మార్గాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా పాదచారుల కదలిక సులభతరం అవడమే కాకుండా ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది.

ప్రమాదాలే హెచ్చరికగా మారాయి: హైదరాబాద్ నగరంలో గతేడాది నమోదైన 1,032 పాదచారుల ప్రమాదాల్లో 400 మంది ప్రాణాలు కోల్పోగా, 775 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో 42 శాతం పాదచారులే ఉండటం ఈ ప్రాజెక్టులకు ప్రేరణగా మారింది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు జరిగిన ప్రమాదాల్లో 190 మంది పాదచారులు ప్రాణాలు కోల్పోవడం అధికారులు మేల్కొనేలా చేసింది.

ఆధునిక స్కైవేల ద్వారా భద్రతా చర్యలు: పొడవైన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రోడ్లు దాటే సమయంలో ప్రమాదాలను నివారించేందుకు లిఫ్టులు, ఎస్కలేటర్లతో కూడిన ఆధునిక స్కైవేలు ప్రజలకు ఉపశమనం కలిగించనున్నాయి. పాదచారుల భద్రతను కాపాడుతూ, స్మార్ట్ సిటీ లక్ష్యానికి చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు త్వరలో రూపుదిద్దుకోనున్నాయి.


Post a Comment (0)
Previous Post Next Post