Cyclone Montha: ఆంధ్రాలో విస్తారంగా వర్షాలు.. మొంథా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది!

Cyclone Montha: మొంథా తుఫాన్ (Cyclone Montha) చివరకు తీరం దాటింది. పెద్ద ప్రమాదాలు సంభవించకుండా తుఫాన్ దాటిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా భారీ తుఫాన్ హెచ్చరికలతో వణికిపోయిన ఆంధ్రప్రదేశ్, మంగళవారం అర్ధరాత్రి తర్వాత తుఫాన్ తీరం దాటడంతో కొంత ఉపశమనం పొందింది.

Cyclone Montha
Cyclone Montha

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, మచిలీపట్నం - కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా, నరసాపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. అయితే దీని ప్రభావంతో ఇంకా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రస్తుతం తెలంగాణ మీదుగా చత్తీస్గడ్ వైపు కదులుతూ బలహీన పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

విస్తారంగా వర్షాలు - నదులు ఉప్పొంగి ప్రవహం: తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు దంచి కొడుతున్నాయి. గడచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉలవలపాడు - 17 సెం.మీ, చీరాల - 15 సెం.మీ వర్షపాతం నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

బుధవారం కూడా కోస్తాంధ్ర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు విశాఖ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, బీభత్స గాలులు కొనసాగుతున్నాయి. నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. వేలమంది పునరావాస కేంద్రాలకు తరలించబడ్డారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పంటలకు అపార నష్టం - వేలమంది పునరావాస కేంద్రాల్లో: రాష్ట్రవ్యాప్తంగా 43 మండలాలు తుఫాన్ ప్రభావానికి గురయ్యాయి. ప్రభుత్వం 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 75 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు.

ప్రాథమిక నివేదికల ప్రకారం, 4.4 లక్షల ఎకరాల వరి, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వర్షపాతం అత్యధికంగా నమోదయింది. శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం, విశాఖ నగరంలో కుండపోత వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

సముద్రంలో అలజడి - మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం ఇంకా ఉధృతంగా ఉండడంతో, ప్రభుత్వం శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. జలాశయాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో 24 గంటలపాటు వర్ష తీవ్రత కొనసాగవచ్చని, అనంతరం తుఫాన్ బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మొంథా తుఫాన్ రాష్ట్రానికి తాత్కాలిక ఇబ్బందులు కలిగించినప్పటికీ, పెద్ద ప్రాణ నష్టం లేకుండా తీరం దాటడం ప్రజలకు ఊరట కలిగించింది.

Post a Comment (0)
Previous Post Next Post