B.Tech Ravi: కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకుంది. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించింది. ఒకవైపు అభివృద్ధి, మరొకవైపు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించడం వల్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ జోరుతోనే టిడిపి 2029 ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడకుండా చూడడమే కూటమి ప్రధాన లక్ష్యం. దీనికి అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ పటిష్టం కాకుండా చూడగలిగితే, టిడిపి ఆశించిన ఫలితాలను సాధించగలదు. అందుకు బలమైన నాయకులను రాయలసీమలో నిలబెట్టడం తర్వతమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో, పులివెందులకు చెందిన బీటెక్ రవికి ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. గతంలో పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తన భార్యను గెలిపించడంలో బీటెక్ రవి కీలక పాత్ర పోషించారు.
 |
B.Tech Ravi |
వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలవడంలో బీటెక్ రవి దూకుడుగా ఉన్నారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి మొదటి అడుగు పెట్టారు. 2017లో వైయస్ వివేకానంద రెడ్డి పై స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు. వైసీపీ హయాంలో శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్‌పై అధికార పార్టీ మాటల దాడిని బీటెక్ రవి సమర్థవంతంగా తిప్పికొట్టారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పులివెందుల నియోజకవర్గంలో పట్టు బిగించారు. జడ్పిటిసి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయడంలో బీటెక్ రవి సక్సెస్ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో ఇదే జోరును కొనసాగించాలంటే బీటెక్ రవి వంటి నాయకునికి కీలక పదవి ఇవ్వడం అవసరం అని భావిస్తున్నారు. బీటెక్ రవిని ఎమ్మెల్సీగా చేసి, తరువాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయన స్థానాన్ని బీటెక్ రవికి అప్పగించడం బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఇలా చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వగలమని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి బీటెక్ రవికి ఖాయమని ప్రచారం జరుగుతోంది. దీంతో బీటెక్ రవి మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది.