Cinnamon Milk Health Benefits: దాల్చిన చెక్క వంటకాలకు ప్రత్యేకమైన రుచి, సువాసనను అందిస్తుంది. ఇది సహజంగా కొంచెం ఘాటు గుణం కలిగి ఉంటుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉండటంతో, దాల్చిన చెక్కను సరైన విధంగా తీసుకుంటే అనేక వ్యాధులను నియంత్రించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేరుగా తినడానికి ఇది బలంగా ఉండటంతో సాధ్యం కాదు. కానీ రాత్రి సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇది షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
![]() |
Cinnamon Milk Health Benefits |
డయాబెటిస్ నియంత్రణలో సహాయం: దాల్చిన చెక్క పాలను క్రమం తప్పకుండా సేవించడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దాల్చిన చెక్క శరీరానికి ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించే శక్తిని ఇస్తుంది. దీంతో షుగర్ తగ్గుతుంది. టైప్–2 డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉపయోగకరం.
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: ఈ పాలను తాగడం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడేవారికి కూడా ఉపశమనం కలుగుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పాలలో, దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఫలితంగా సీజనల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
ఎముకలు బలపడతాయి: దాల్చిన చెక్క పాలను సేవించడం ద్వారా శరీరానికి కావలసిన క్యాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలు బలంగా మారేందుకు సహాయపడుతుంది.
ఒత్తిడి తగ్గి మంచి నిద్ర: రాత్రి సమయంలో ఈ పాలను తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర వస్తుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణ: దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది: కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: బరువు తగ్గాలనుకునేవారు ఈ పాలను కొవ్వు తీసిన పాలతో సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
వాపులు తగ్గిస్తాయి: దాల్చిన చెక్కలో ఉండే "సినమాల్డిహైడ్" అనే పదార్థం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. దీని వల్ల శరీరంలోని వాపులు తగ్గుతాయి.
అయితే గర్భిణీలు, అలర్జీలు ఉన్నవారు, రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు, లివర్ సమస్యలతో బాధపడేవారు మాత్రం ఈ పాలను సేవించరాదని వైద్యులు సూచిస్తున్నారు.