Telangana Factory Blast: తెలంగాణ చరిత్రలోనే అత్యంత విషాదకరంగా నిలిచిన పాశమైలారం పేలుడు ప్రమాదం.!

Telangana Factory Blast: తెలంగాణ పరిశ్రమల చరిత్రలో ఇదొక గుండెలను బిగపట్టే ఘటన. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమైలారంలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ లో సంభవించిన భారీ పేలుడు విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా సంభవించిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. 34 మందికి గాయాలు, ఇంకా ఐదుగురు ఆచూకీ లేకుండా పోయారు.

ప్రమాద సమయంలో పరిశ్రమలో 147 మంది కార్మికులు పని చేస్తున్నారు. రియాక్టర్ పేలిన సమయంలో అక్కడ ఉష్ణోగ్రత 700 నుంచి 800 డిగ్రీల మధ్య ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో ఐదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ విపత్తు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే పరిశ్రమ భవనంలో ఉన్న 14 అంగుళాల మందంతో నిర్మించిన ప్లింత్ బీమ్‌లు కూడా కూలిపోయాయి.

పేలుడు సమయంలో పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందకి దిగుతుండగా పేలుడు జరిగింది. దాని తీవ్రతకు ఆయన మృతదేహం 50 మీటర్లు దూరం దూసుకుపోయింది. అంటే ఘటన తీవ్రత ఎంత పెద్దదో అని అర్ధం చేసుకోవచ్చు.

ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సర్వీసులు, హైడ్రాలిక్ క్రేన్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 11 ఫైర్ ఇంజిన్లు మంటల్ని అదుపు చేశాయి. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సిందేనని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే చాలా మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి.

ఈ పరిశ్రమ గుజరాత్ కేంద్రంగా పనిచేసే సిగాచీ సంస్థ కు చెందినది. పాశమైలారంలోని పరిశ్రమ 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 189 మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు, వారిలో ఎక్కువమంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. సంస్థలో మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధ పదార్థం తయారవుతుంది, ఇది ఇతర ఔషధ కంపెనీలకు సరఫరా చేస్తారు.

Also Read: 2025 తొలి ఆరు నెలల్లో భారతదేశాన్ని వణికించిన 6 అతిపెద్ద విపత్తులు

సోమవారం ఉదయం 8 గంటల సమయంలో, కార్మికులు విధులకు హాజరైన కొద్ది సమయానికే స్ప్రేయర్ డ్రయ్యర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఒక్క క్షణం తేడాలో ఎన్నో ప్రాణాలు నశించిపోయాయి. పరిశ్రమ వెలుపల పరిస్థితి భయంకరంగా మారింది. విలపిస్తున్న బంధువులు, సహాయం కోసం పరుగులు తీస్తున్న బాధితులు, మంటల్లో కాలిపోయిన శవాలు, శిథిలాల్లోంచి వెలికితీస్తున్న మిగతా మృతదేహాలు... అన్నీ కలిపి ఘోర దృశ్యాన్ని తలపించాయి.

తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమను ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీను నియమించారు. సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని ఈ కమిటీకి DRF స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అదనపు డీజీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులు ఇవ్వనుంది.

ఈ ప్రమాదం తెలుపుతున్న సందేశం స్పష్టంగా ఏం తెలియచేస్తుంది అంటే.. సాంకేతిక లోపాలను, సేఫ్టీ నిబంధనలను పట్టించుకోకపోతే, ఎంతటి ఘోరమయిన ఫలితాలు ఎదురయ్యే అవకాశముందో దుర్ఘటన గుర్తు చేస్తోంది.

Also Read: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం: ఒకే ఒక్క మృత్యుంజయుడి అద్భుత గాథ

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post