Kota Srinivasa Rao Political Journey: కోటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం.. ఎమ్మెల్యేగా గెలిచిన అతితక్కువ మంది నటులలో ఒకరు!

Kota Srinivasa Rao Political Journey: తెలుగు సినిమా పరిశ్రమకు చెరగని గుర్తుగా నిలిచిన కోటా శ్రీనివాసరావు మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో 1942, జూలై 10న జన్మించిన ఆయనకు చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది. బాల్యంలోనే నాటకాల్లో పాల్గొంటూ నటనపై తన ఆసక్తిని చాటుకున్నారు.

Kota Srinivasa Rao Political Journey


సినిమాలలోకి రాకముందు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసిన కోటా, అదే సమయంలో నాటకాల ద్వారా తన నటనను మెరిపించారు. 1978లో “ప్రాణం ఖరీదు” చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఆయనకు తొలి అవకాశాన్ని దర్శక-నిర్మాత క్రాంతి కుమార్ ఇచ్చారు. “ప్రతిఘటన” చిత్రంలో విలన్ పాత్రలో చేసిన నటన ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు ఎన్నో అవార్డులు, గుర్తింపులు సొంతం చేసుకున్నారు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, కఠిన విలన్‌గా… ఇలా ఏ పాత్రలోనైనా తనదైన ముద్ర వేసారు. విలనిజానికి కొత్త నిర్వచనం ఇచ్చిన నటుడిగా కోటా గుర్తింపు పొందారు.

సినీరంగానికే పరిమితం కాకుండా కోటా రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చిన కోటా, స్వతహాగా వాజ్‌పేయి ఆలోచనలకు అభిమానిగా, 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అనంతరం రాజకీయాల నుంచి విరమించుకుని మళ్లీ సినీ రంగానికే పరిమితమయ్యారు. ఆ తరువాత మరోసారి నటనలో కొనసాగుతూ వందల చిత్రాల్లో నటించారు.2015లో కోటా శ్రీనివాసరావు గారు పద్మశ్రీ పురస్కారాన్ని అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా స్వీకరించారు. తన సినీ ప్రయాణంలో తొమ్మిది నంది అవార్డులు గెలుచుకోవడం కోటా ప్రతిభకు నిదర్శనం.

Also Read: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇకలేరు

Post a Comment (0)
Previous Post Next Post