Nimisha Priya Case: యెమెన్ వంటి ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా హత్యల వంటి నేరాలకు అక్కడ శిక్ష తప్పదు. ఇటీవలి కాలంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ. ఆమెపై నేరం రుజువైన నేపథ్యంలో యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే ప్రస్తుతం ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు బహుళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో అత్యంత కీలకంగా మారింది "బ్లడ్ మనీ" అనే అంశం.
'బ్లడ్ మనీ'? ఇది ఎలా పనిచేస్తుంది?
బ్లడ్ మనీకి తెలుగు అనువాదం "క్షమా ధనం"గా చెప్పవచ్చు. ఇది షరియా చట్టాల ప్రకారం అమలులో ఉంటుంది. నేరం రుజువైనప్పటికీ, బాధిత కుటుంబం నేరస్తుని క్షమిస్తే, ఆ శిక్ష నుంచి ఉపసంహరణ పొందే అవకాశం ఉంటుంది. అయితే, క్షమించడంలో భాగంగా ఒక నష్టపరిహారంగా, ఆర్థిక పునరావాసం కోసం బాధితులకు డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అదే బ్లడ్ మనీ.
బ్లడ్ మనీ చెల్లిస్తే శిక్ష ఎలా రద్దవుతుంది?
బాధిత కుటుంబం ఈ బ్లడ్ మనీని స్వీకరిస్తే, నేరస్తుడిని క్షమించినట్లుగా పరిగణిస్తారు. దీంతో కోర్టు ఆ శిక్షను రద్దు చేయవచ్చు. ఇది యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో షరియా చట్టాల కింద సాధారణంగా అమలులో ఉన్న నియమం. ఇటీవలి కాలంలో కూడా అనేక మరణశిక్షలు, బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంగీకరించడంతో రద్దయ్యాయి.
నిమిష ప్రియ కేసులో బ్లడ్ మనీ ఎంత?
నిమిష ప్రియను ఉరిశిక్ష నుండి కాపాడేందుకు భారత ప్రభుత్వం, మతపెద్దలు, న్యాయవాదులు కలిసి బాధిత కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్లడ్ మనీ కింద దాదాపు 1 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే సుమారు రూ.8.6 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటివరకు బాధిత కుటుంబం నుండి స్పష్టమైన స్పందన రాలేదు.
ఇప్పుడు ఎం జరుగుతోంది?
నిమిష ప్రియ ప్రాణాలు నిలుపుకోవాలంటే బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంగీకరించాలి. అందుకోసం భారత ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ స్వయంగా బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. అధికారులు, న్యాయవాదులు కలిసి బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. శిక్ష అమలు చేసే ముందు చివరి దశలో ఈ బ్లడ్ మనీ ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది.