గవర్నర్ ఆమోదంతో బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయా? రేవంత్ ప్లాన్‌కి కోర్టు షాక్ ఇస్తుందా?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందు ఈ రిజర్వేషన్లను అమలుచేయాలని భావిస్తూ.. ప్రస్తుతం ఆర్డినెన్సు రూపంలో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి పంపినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదం లభిస్తే వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దీనిని అమలులోకి తీసుకురానున్నారు.

అసెంబ్లీలో ఆమోదం – రాష్ట్రపతి వద్ద పెండింగ్

2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో బిల్లు ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద పెండింగ్‌లో ఉంది. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు నాలుగు నెలల గడువు ఇవ్వడంతో, ఈ వ్యవహారం తిరిగి చర్చలోకి వచ్చింది.

హైకోర్టు ఆదేశాలతో.. ఆర్డినెన్స్ మార్గం

స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 వ తేదీ లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులో ఉండేలా చూడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకుంది. కానీ ఇది రాజకీయ ప్రేరణ తో చేసిన నిర్ణయమా? లేక నిజమైన సామాజిక న్యాయంపై ధృఢ నమ్మకమా? అనే చర్చ కొనసాగుతోంది.

గవర్నర్ ఆమోదం కీలకం.... కానీ

ఆర్డినెన్సును అమలులోకి తేవడానికి గవర్నర్ ఆమోదం తప్పనిసరి. కానీ ఇలాంటి కీలక సామాజిక అంశాల్లో గవర్నర్‌కు పూర్తిస్థాయి అధికారాలు లేవు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించేందుకు తీసిన ఆర్డినెన్సును ఉమ్మడి హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అభివృద్ధి మరియు ఇతర అంశాల్లో ఆర్డినెన్స్ తీసుకువస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ కొన్ని సామాజిక వర్గాలను ప్రభావితం చేసే అంశాలపై
మాత్రం గవర్నర్ ఆమోదం తెలుపుతారా అనే సంధిగ్ధత నెలకొంది.

రాజ్యాంగ పరిమితులు – సుప్రీంకోర్టు అభిప్రాయం

రిజర్వేషన్ల వ్యవహారంలో మొత్తం పరిమితిని 50% మించకూడదన్న అభిప్రాయం సుప్రీంకోర్టు నుంచి ఎన్నోసార్లు వచ్చింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిపి 50%కి చేరగా.. బీసీలకు అదనంగా 42% ఇవ్వాలంటే.. అది రాజ్యాంగానికి విరుద్ధమవుతుందన్న వాదనలు వెలువడుతున్నాయి. తమిళనాడు లో 1994 లో తీసుకొచ్చిన రిజర్వేషన్ల తరహాలో పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా తెలంగాణ రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగం లోని 9 వ షెడ్యూల్ లో చేర్చితే తప్ప, కోర్టుల నుండి వీటికి రక్షణ ఉండదు కాబట్టి అప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 42% బీసీలకు రిజర్వేషన్ అంశం ఎటూ తేలకపోవచ్చననేది రాజకీయ, న్యాయ నిపుణుల అభిప్రాయం.

రేవంత్ సంకల్పం గొప్పదైనా..న్యాయ, రాజ్యాంగ మద్దతు అవసరం

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సామాజిక న్యాయ కోణంలో చూసినా, న్యాయ–రాజ్యాంగ పరంగా దానికి మన్ననలు అవసరం. ఆర్డినెన్సు ద్వారా తాత్కాలికంగా అమలు సాధ్యపడినా, చట్టం నిలబడడం పై అనేక  సందేహాలు గట్టిగానే ఉన్నాయి. గవర్నర్ ఆమోదం, రాష్ట్రపతి అనుమతి, సుప్రీంకోర్టు అభిప్రాయం — ఇవన్నీ కీలకంగా మారనున్నాయి.




Post a Comment (0)
Previous Post Next Post