CII Partnership Summit 2025: విశాఖలో పెట్టుబడుల సదస్సు ఘనంగా ప్రారంభం.. పవన్ కళ్యాణ్ రానున్నారా?

CII Partnership Summit 2025: ఆంధప్రదేశ్ లోని విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ వేదికగా రెండు రోజులపాటు కొనసాగనుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు విశాఖకు చేరుకోనున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం ఈ సదస్సుకు విస్తృత సన్నాహాలు చేసింది. సీఎం చంద్రబాబు, మంత్రులు స్వయంగా వెళ్లి ఆహ్వానాలు అందించారు. దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

CII Partnership Summit 2025
CII Partnership Summit 2025

అయితే ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా? రారా? అనే సందేహం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పౌర సంబంధాల శాఖ విడుదల చేసిన అతిధుల జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. గత కొద్దిరోజులుగా అటవీ శాఖ భూముల పరిశీలన, ఎర్రచందనం నిల్వల తనిఖీలు చేస్తూ పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమించిన భూముల వీడియోలను తీసి సహచర మంత్రులకు చూపడం కూడా ఆయన కదలికలకు మరింత ప్రాముఖ్యత తెచ్చింది.

Also Read: ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పంటల మార్పు అవసరం - సీఎం చంద్రబాబు

కూటమి ప్రభుత్వం - స్పష్టమైన బాధ్యతల విభజన
కూటమి ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తే కీలక నాయకుల మధ్య బాధ్యతల విభజన స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్వహణను సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రజాసంబంధ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంత అభివృద్ధి పర్యటనల్లో చురుకుగా ఉంటున్నారు. లోకేష్‌ పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలు మరియు విభాగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు.

ఈ ముగ్గురు నాయకులు పరస్పర సమన్వయంతో కదలడం, విభిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టించకుండా ముందుకు సాగడం కూటమి ప్రభుత్వ స్థిరత్వానికి సూచికగా భావించబడుతోంది.

ప్రకటనల్లో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక స్థానం
విశాఖ పెట్టుబడుల సదస్సుకు సంబంధించి పౌర సంబంధాల శాఖ భారీగా ప్రకటనలు విడుదల చేసింది. ఆ ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు స్పష్టంగా చోటు చేసుకున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ తప్పకుండా సదస్సుకు హాజరవుతారని చాలా మంది భావించారు.

కానీ అతిధుల జాబితాలో మాత్రం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, సిఐఐ కోఆర్డినేటర్లు మాత్రమే ఉండటంతో పవన్ కళ్యాణ్ హాజరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అనుకూల మీడియా అయితే దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్‌ను సైడ్ చేస్తున్నారనే వాదనలకు బలం చేకూర్చుతోంది.

రెండో రోజు హాజరయ్యే అవకాశాలు ఎక్కువ
సదస్సు మొదటి రోజు అతిధుల జాబితా మాత్రమే విడుదల చేశారు. మొత్తం రెండు రోజుల కార్యక్రమంలో రేపటి రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కీలక ఉపన్యాసాలు చేసే ఈ సదస్సు ఈరోజు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగింపు కార్యక్రమంతో సదస్సు ముగియనుంది. గతంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఏ కార్యక్రమాన్నీ పవన్ కళ్యాణ్ మిస్ కాకుండా హాజరైన దృష్ట్యా, రేపటి జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.


Post a Comment (0)
Previous Post Next Post