Ande Sri: ప్రఖ్యాత రచయిత అందెశ్రీ కన్నుమూత!

Ande Sri: ప్రసిద్ధ రచయిత, కవి అందెశ్రీ (64) మృతి చెందారు. సోమవారం ఉదయం లాలాగూడలోని తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలగా, ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జూలై 18న అప్పటి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని రేబర్తి గ్రామంలో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Ande Sri
Ande Sri

జయ జయహే తెలంగాణ గీత రచయిత
తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ అందించిన సేవలు అపారమైనవి. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ గీతం ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. ఈ పాట తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపి, ఉద్యమానికి కొత్త దిశనిచ్చింది. చివరకు అదే గీతం తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందింది. ఆయన రచనలలో ప్రజా బాధలు, తెలంగాణ గర్వభావం, మట్టి వాసన కలిసిన జీవగీతాలు.

గొర్రెల కాపరి నుంచి డాక్టరేట్ వరకు
అందెశ్రీ జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది. ఒకప్పుడు గొర్రెల కాపరిగా జీవనం ప్రారంభించిన ఆయన, కవిత్వం పట్ల ఉన్న అపారమైన ఆసక్తితో ప్రజాకవిగా ఎదిగారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, వెనక్కి తగ్గలేదు. కవిత్వమే ఆయనకు ఊపిరిగా మారింది. సాహిత్యానికి అంకితమైన ఆయనకు కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.1 కోటి నగదు పురస్కారం అందుకున్నారు.

ప్రజల మనసులో నిలిచిన గేయకవి
అందెశ్రీ రచనలు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందాయి. ఆయన రాసిన పాటల్లో మనిషి జీవన విలువలు, గ్రామీణ భావాలు, సామాజిక స్పృహ ప్రతిబింబిస్తాయి. ‘పల్లెనీకు వందనములమ్మో’, ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు’, ‘గలగల గజ్జెల బండి’, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా’, ‘జనజాతరలో మన గీతం’ వంటి గేయాలు ప్రజల హృదయాలను తాకాయి. ఆయన రాసిన ప్రతి పంక్తి తెలంగాణ మట్టివాసనతో నిండివుంటుంది.

అందెశ్రీకి లభించిన గౌరవాలు, పురస్కారాలు
అశువుకవిత్వంలో అందెశ్రీ దిట్ట. 2006లో ‘గంగ’ సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. అంతేకాకుండా ఆయన సాహిత్య ప్రస్థానంలో అనేక గౌరవాలు అందుకున్నారు.

2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్
2015లో దాశరథి సాహితీ పురస్కారం
2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
2022లో జానకమ్మ జాతీయ పురస్కారం
2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం
అలాగే లోక్ నాయక్ పురస్కారం కూడా అందుకున్నారు.

మట్టిమనిషి అందెశ్రీ - చిరస్థాయిగా నిలిచిన పేరు
తెలుగు భాష, సాహిత్యం, తెలంగాణ మట్టి పట్ల ఉన్న ప్రేమతో అందెశ్రీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఆయన కలం నిలిచిపోయినా, ఆయన రాసిన పదాలు ఎప్పటికీ తెలంగాణ ఆత్మగా మోగుతూనే ఉంటాయి.

Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ!

Post a Comment (0)
Previous Post Next Post