US Government Shutdown 2025: అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెర!

US Government Shutdown 2025: అమెరికాలో 40 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌కు చివరికి తెరపడింది. దీని పరిష్కార దిశగా కీలకమైన అడుగు పడింది. దీనికి సంబంధించిన బిల్లును అమెరికా సెనెట్ ఆమోదించింది. దీంతో ఫెడరల్ సేవలన్నీ పునరుద్ధరించబడనున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలపై ఉన్న అంతరాయం తొలగి సాధారణ స్థితికి వస్తున్నాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాలను స్తంభింపజేసిన షట్‌డౌన్‌ను ముగించడానికే ఈ బిల్లు ఉద్దేశించబడింది. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ కేపిటల్ వద్ద జరిగిన ఓటింగ్ సందర్భంగా పలువురు సెనెటర్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

US Government Shutdown 2025
US Government Shutdown 2025

జనవరి 30 వరకు నిధుల కేటాయింపు

జనవరి 30 వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి సవరించిన బిల్లుపై సెనెటర్లు ఓటు వేశారు. ఈ బిల్లులో మూడు పూర్తి సంవత్సరాల కేటాయింపు బిల్లులు కూడా ఉన్నాయి. సెనెట్ ఈ సవరించిన బిల్లును ఆమోదించిన తర్వాత, తుది ఆమోదం కోసం తిరిగి హౌస్‌కు పంపబడుతుంది. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం పంపుతారు. ఈ మొత్తం ప్రక్రియకు ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read: దక్షిణాఫ్రికా జీ-20 శిఖరాగ్ర సమావేశానికి అమెరికా దూరం.. కారణం ఏమిటి?

ఆర్థిక, రాజకీయ ఒత్తిడి మధ్య సెనెట్ నిర్ణయం
అమెరికాలో షట్‌డౌన్ 40 రోజులు దాటుతున్న వేళ, పెరుగుతున్న ఆర్థిక మరియు రాజకీయ ఒత్తిడి మధ్య ఈ ద్వైపాక్షిక బిల్లును సెనెట్ ఆమోదించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. షట్‌డౌన్ కొనసాగితే రాబోయే థాంక్స్‌గివింగ్ సెలవుల్లో ప్రయాణ గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని, అలాగే నాలుగో త్రైమాసిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ భయాలకు సెనెట్‌ ఆమోదం కొంత ఉపశమనం కలిగించింది.

డెమోక్రాట్లు-రిపబ్లికన్ల మధ్య ఒప్పందం
డెమోక్రాట్లతో చర్చల అనంతరం రిపబ్లికన్లు అఫర్డబుల్ కేర్ యాక్ట్ కింద సబ్సిడీలను పొడిగించడంపై డిసెంబర్‌లో ఓటు వేయడానికి అంగీకరించారు. ఈ ఒప్పందం వల్ల షట్‌డౌన్ సమయంలో ట్రంప్ పరిపాలన చేపట్టిన ఫెడరల్ ఉద్యోగుల భారీ తొలగింపులు కొంతవరకు రద్దుకావచ్చని అంచనా. అలాగే సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ప్రయోజనాల కోసం మరో ఏడాది పాటు పూర్తి నిధులు సమకూరుస్తుంది.

మధ్యవర్తిత్వం, విభేదాలు
ఈ ద్విపాక్షిక ఒప్పందానికి న్యూ హాంప్‌షైర్ డెమోక్రాట్ సెనెటర్లు మాగీ హసన్, జీన్ షాహీన్, అలాగే మెయిన్ స్వతంత్ర సెనెటర్ అంగస్ కింగ్ మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అయితే సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షుమెర్ దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం, డెమోక్రాట్లలో కొనసాగుతున్న అసంతృప్తికి ప్రతిబింబంగా మారింది.

చరిత్రలోనే సుదీర్ఘమైన షట్‌డౌన్
ఈ సంవత్సరం షట్‌డౌన్ 40వ రోజుకు చేరుకోవడంతో ఇది అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా నిలిచింది. దీని ప్రభావంతో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులు సెలవుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. పలు కీలక సేవలు నిలిచిపోయాయి. నేషనల్ పార్కులు మూసివేయబడ్డాయి. ఆహార సరఫరా మరియు దానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సిబ్బంది కొరత కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి.

ముగింపు దిశగా ఆశాకిరణం
దీర్ఘకాలంగా అమెరికా ప్రభుత్వాన్ని స్థంభింపజేసిన షట్‌డౌన్‌కి సెనెట్ ఆమోదించిన బిల్లు కొత్త ఆశాకిరణంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ బిల్లు తుది ఆమోదం పొందితే, ఫెడరల్ సేవలు మళ్లీ సాధారణ స్థితికి చేరి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post