The Heartbreaking Reddit Story: కన్నీరు పెట్టే ఘటన ఇది. చదివిన ప్రతి పదం మనసును ముక్కలు చేస్తోంది. ఎటువంటి వ్యక్తిగత సంబంధం లేకపోయినా అతని కథ కళ్లముందు వేదనగా తళుక్కుమంటోంది. అతడు రాసిన ఒక్కో అక్షరం హృదయాన్ని మెలిపెడుతోంది. జీవితం పట్ల ఒక మనిషి కోరిక ఇంత బలంగా ఉంటుందా అని ఆలోచన కలిగిస్తోంది. రెడిట్‌లో 21 ఏళ్ల యువకుడు చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చదివిన వారందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
![]() |
The Heartbreaking Reddit Story |
క్యాన్సర్‌తో పోరాడిన చిన్న వయస్కుడు : ఆ యువకుడికి కేవలం 21 సంవత్సరాల వయసే. కానీ పెద్దపేగు క్యాన్సర్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా, వైద్యులు విభిన్న రకాల చికిత్సలు చేసినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబం అతడి కోసం విపరీతంగా ఖర్చు చేసినా, వ్యాధి తగ్గకపోవడంతో చివరి గడియలు సమీపించాయి. ఇంకొద్దిరోజుల్లో తాను గోడకు వేలాడే ఫోటోగా మిగిలిపోతానని అతడు బాధతో రాసుకొచ్చాడు. తల్లిదండ్రులకు భారమైన జ్ఞాపకంగా మారబోతున్నానన్న ఆలోచన అతడిని మరింత కలచివేసింది.
జీవితం పట్ల ఆవేదన -రెడిట్ పోస్ట్ :
జీవితం పట్ల ఆవేదన -రెడిట్ పోస్ట్ :
తన బాధను వ్యక్తం చేసేందుకు రెడిట్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “నాకు 21 సంవత్సరాల వయసు. పెద్దపేగు క్యాన్సర్ సోకింది. ఈ దీపావళికి నేను భూమిపై ఉండకపోవచ్చు. మా తల్లిదండ్రులు నా పరిస్థితిని చూసి కన్నీరు పెడుతున్నారు. వారిని చూడటం నాకు కష్టంగా ఉంది. నాకు కుక్కలు అంటే ఎంతో ఇష్టం. ట్రావెలింగ్ అంటే ఆసక్తి. సొంతంగా వ్యాపారం చేయాలని కలలు కన్నాను. కానీ ఇవన్నీ ఇప్పుడు మసకబారిపోతున్నాయి. ఇకపై నేను కేవలం గోడపై వేలాడే ఫోటోగా మారిపోతాను. నా బాధను ఎందుకు రాస్తున్నానో తెలియదు. బహుశా నేను లేని తర్వాత ఇవే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయేమో. కానీ నాకు నా భవిష్యత్తు అస్పష్టంగా కనిపిస్తోంది” అని ఆ యువకుడు తన భావాలను పంచుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా స్పందనలు : అతని పోస్ట్ చూసినవారు గాఢమైన విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కన్నీరు పెట్టుకోగా, మరికొందరు అద్భుతం జరిగి అతను బతికిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంకొందరు అతని చిన్న వయసులోనే జీవితం ముగిసిపోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. ఆ యువకుడి మాటలు మిలియన్ల హృదయాలను కదిలించాయి.